కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చించివేశారు. దేశ రైతులకు తాను ద్రోహం చేయదలచుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. చట్టాల రద్దు కోసం తీర్మానం చేసేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ ప్రతులను చించివేశారు. కేజ్రీతో సహా.. పలువురు ఆప్ ఎమ్మెల్యేలూ ఈ ప్రతులను చించివేసి నిరసన తెలిపారు.
అధికార పార్టీ తీసుకొచ్చిన చట్టాలు.. రైతుల కోసం కాదని, ఎన్నికల సమయంలో ఫండ్స్ ఇచ్చే వారి కోసమని కేజ్రీవాల్ ఆరోపించారు. 'నేను ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేయడం లేదు. రైతులకు ద్రోహం చేయడం ఇష్టం లేకే చేస్తున్నా. చలిగాలుల్లో రోడ్లపై నిద్రిస్తూ హక్కుల కోసం పోరాడుతున్న రైతుల కోసం ఇది చేస్తున్నా.' అంటూ ఉద్వేగంగా మాట్లాడారు సీఎం.