దిల్లీలో జరుగుతున్న పౌరచట్ట వ్యతిరేక ఆందోళనల్లో హింసను ఖండించింది కాంగ్రెస్ పార్టీ. అల్లర్లకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆందోళనలను రూపుమాపడంలో దిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించింది. రాజకీయాల కారణంగా దిల్లీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయపడింది.
సంయమనం పాటించాలి: సోనియా
దిల్లీ ప్రజలు సహోదర భావంతో మెలగాలని, హింసకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని అనుకునే వారి ఆటలు సాగనివ్వకూడదని పేర్కొన్నారు.
'హింసాత్మక ఆందోళన వద్దు'
శాంతియుత నిరసన ప్రదర్శనలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచన అని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కానీ హింసాత్మక నిరసనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. దిల్లీలో హింసాత్మకంగా మారిన నిరసనలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.