వాయుకాలుష్యంతో దిల్లీ అల్లాడిపోతుంది. దట్టమైన పొగమంచు కురుస్తుండటం వల్ల దిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం కూడా దిల్లీలో గాలినాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) ప్రకారం దిల్లీలో గాలి నాణ్యత 428గా ఉంది. దృశ్య నాణ్యత కూడా పూర్తిగా పడిపోయింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా చోట్ల చాలా దట్టమైన పొగమంచు(డెన్స్ ఫాగ్) కురుస్తోంది. పంజాబ్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లో దట్టమైన పొగమంచు కురుస్తోందని వాతావారణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. హరియాణా, చండీగఢ్, దిల్లీ, తూర్పు ఉత్తర్ ప్రదేశ్, బిహార్, అసోం, మేఘాలయాల్లో మధ్యస్థ స్థాయిలో ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని ఐఎండీ సూచించింది.