ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగిని రక్షించే క్రమంలో దిల్లీలోని ఎయిమ్స్ సీనియర్ వైద్యుడొకరు తన వ్యక్తిగత భద్రతను పణంగా పెట్టారు. రోగిని కాపాడే క్రమంలో తన వ్యక్తిగత రక్షణ ఉపకరణాలను ఆయన తొలగించారు. దీంతో ఆయనను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు.
ఈ నెల 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వైద్యుడి పేరు జహీద్ అబ్దుల్ మజీద్. జమ్మూ-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా ఆయన స్వస్థలం. కొవిడ్-19 రోగి ఒకరిని అంబులెన్స్‌లో ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లోని ఐసీయూకు తరలించే బాధ్యతను ఆయనకు అప్పగించారు.
అయితే శ్వాస తీసుకోవడంలో ఆ రోగి ఇబ్బంది పడుతున్నట్లు మజీద్ గుర్తించారు. శ్వాస కోసం గొంతులోకి వేసిన గొట్టం పొరపాటున ఊడిపోయినట్లు ఆయన గమనించారు. దాన్ని తిరిగి యథాస్థానంలో ప్రవేశపెట్టేందుకు ఈ వైద్యుడు ప్రయత్నించారు.