తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2020, 7:59 AM IST

ETV Bharat / bharat

దిల్లీలో హోరాహోరీ.. హస్తిన పీఠం దక్కేదెవరికి?

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు అధికారం చేపట్టేందుకు పూర్తి స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అధికార ఆప్​ ప్రజలపై ఎన్నో వరాల జల్లులను కురిపించిన. మరి ఇవి ఫలించేనా? ఈసారైనా భాజపా దిల్లీలో జెండా ఎగరేసేనా?

dehli has hot with elections and who will get power in delhi state
దిల్లీ బరిలో హోరాహోరీ.. హస్తిన పీఠం దక్కేదెవరికి?

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పక్షాలూ పూర్తిస్థాయి శక్తియుక్తులతో సిద్ధమవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దిల్లీలో భాజపా 57 శాతం ఓట్లతో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాల్నీ తన ఖాతాలో వేసుకొంది. దిల్లీలో అధికార పక్షమైన ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) కేవలం 18 శాతం ఓట్లను మాత్రమే సాధించి, అయిదు చోట్ల మూడో స్థానంలో నిలిచింది. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా చూస్తే, భాజపా మొత్తం 70 స్థానాలకుగాను 65 సీట్లలో ఆధిక్యం కనబరచింది. కాంగ్రెస్‌ అయిదింటిలో ఆధిక్యం ప్రదర్శించగా, 'ఆప్‌' ఒక్కస్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై భాజపాలో పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. కానీ, ఆ స్థాయి నమ్మకం 'ఆప్‌' శిబిరంలో కనిపిస్తోంది. అధికార ఆప్‌ను ఎదుర్కొనేందుకు భాజపా సతమతమవుతుండగా, కాంగ్రెస్‌ కూడా వెనుకంజలోనే ఉంది.

పంథా మార్చిన కేజ్రీవాల్​

'ఆప్‌' అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ 2019 సార్వత్రిక ఎన్నికల్లో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడమే ఈ తరహా వాతావరణం ఏర్పడటానికి కారణమని చెప్పాలి. మోదీపై పోరాడే ఏకైక యోధుడిగా పేరు సంపాదించాలని తాపత్రయ పడుతూ విభిన్న జాతీయ అంశాలకు సంబంధించి ప్రత్యక్షంగా విమర్శల దాడికి యత్నించే కేజ్రీవాల్‌ తన శైలిని మార్చుకున్నారు. ‘ప్రధానమంత్రి పదవికి మోదీ, ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌’ అనే భావన చాలామంది దిల్లీవాసుల్లో నెలకొని ఉందన్న సంగతిని ఆయన గుర్తించారు. దాంతో, అప్పట్నుంచి ప్రధాని మోదీపై విమర్శల దాడిని పూర్తిగా ఆపేశారు. సానుకూల, ప్రభుత్వ అనుకూల ఓట్లను సాధించే లక్ష్యంతో గత అయిదేళ్లుగా తమ సర్కారు సాధించిన ఘనతల్ని ‘ఆప్‌’ భారీస్థాయిలో ప్రచారం చేస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో దిల్లీలో విద్యారంగానికి బడ్జెట్‌లో 35 శాతం కేటాయించారు. పాఠ్యప్రణాళికలో విభిన్న అంశాలను ప్రవేశపెట్టడమే కాకుండా, ఉపాధ్యాయుల్లో పునరుత్తేజం నింపేందుకు శిక్షణ కార్యక్రమాలనూ ఏర్పాటుచేశారు. ఆరోగ్య రంగంలో ‘ఆప్‌’ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మొహల్లా క్లినిక్‌’లు భారీస్థాయిలో ప్రజాదరణ పొందాయి. ఇప్పటివరకు 400 మొహల్లా క్లినిక్కులు పేదలకు సేవలందిస్తున్నాయి. దిల్లీలో మహిళలకు భద్రత కరవైందనే విమర్శలు తీవ్రతరమైన నేపథ్యంలో ‘ఆప్‌’ ప్రభుత్వం అవసరమైన చర్యలకు దిగింది. మహిళా ప్రయాణికుల కోసం ‘పింక్‌’ పాసులను ప్రవేశపెట్టింది. వీటితో మహిళలు దిల్లీ రవాణా సంస్థ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.

ఆ బస్సుల్లో రక్షణ కోసం మార్షల్స్‌నూ నియమించారు. ఫలితంగా, లబ్ధిదారులైన మహిళలకు సురక్షితంగా ప్రయాణం చేస్తున్నామనే భావనతోపాటు, ప్రతినెలా సగటున రూ.1,200 నుంచి రూ.1,800 వరకు లబ్ధి చేకూర్చినట్లయింది. నీటి బిల్లును సగానికి తగ్గించడం, విద్యుత్తును 200 యూనిట్ల వరకు వాడేవారికి ఉచితంగా అందజేయడం వంటి నిర్ణయాలూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల ప్రభావం కలిగించాయనే అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వెంట నడిచిన పెద్ద సంఖ్యలోని మధ్యతరగతి వర్గం- అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్‌’ ప్రభుత్వానికి అండగా నిలిచే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలతో ప్రయోజనాలు పొందిన పట్టణ పేదలు గతంలో కాంగ్రెస్‌కు ఓటేసేవారు; వారు ఇప్పుడు ‘ఆప్‌’ వైపు మొగ్గు చూపవచ్చనే అభిప్రాయాలున్నాయి. ‘తొలిసారిగా, దిల్లీ ఓటర్లు పూర్తిస్థాయిలో స్థానిక అంశాలైన ఆరోగ్యం, విద్య, మహిళల రక్షణ వంటి అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్‌, భాజపా అధికారంలో ఉన్నప్పుడు ఈ రంగాల విషయంలో చేసిన కృషి తక్కువే. దిల్లీ ప్రభుత్వానికి ఉన్న పరిమిత వనరులు, అధికారాలను సాకుగా చూపేవారు. దీనికి విరుద్ధంగా ‘ఆప్‌’ ప్రభుత్వం అవే పరిమిత వనరులు, అధికారాలతో విధులు నిర్వర్తించింది’ అని స్వతంత్ర రాజకీయ విశ్లేషకులు ఒకరు వ్యాఖ్యానించారు.

'ఆప్‌' ప్రభుత్వం సుపరిపాలన అజెండాను పరిగణనలోకి తీసుకుంటూనే, విభిన్న ఆర్థిక, సామాజిక వర్గాల మధ్య సమతౌల్యం సాధించిందనే అభిప్రాయాలున్నాయి. పూర్వాంచల్‌కు చెందిన ఓటర్లు తమపట్ల సానుకూల వైఖరి కనబరచేలా ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్ర కృషి చేసింది. యూపీ, బిహార్‌ల నుంచి వలస వచ్చిన వీరు గతంలో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచేవారు. భాజపా వెనక నడిచే పంజాబీ-జాట్‌ వర్గాన్నీ ‘ఆప్‌’ ఆకట్టుకుంది. భాజపాకు మద్దతుగా నిలిచే వ్యాపార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినంటూ పరోక్షంగా చాటుకోవడం ద్వారా, కేజ్రీవాల్‌ ఆ వర్గాన్ని తనవైపు తిప్పుకొన్నారనే వాదన ఉంది. కాంగ్రెస్‌ మద్దతుదారులైన నిరుపేద వర్గాల్నీ తనకు అనుకూలంగా మార్చుకున్నారని చెబుతున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీకి సానుకూల సంకేతాలు కనిపిస్తుండటానికి మరో కారణం- అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఉన్న పేరు ప్రతిష్ఠలు. పార్టీని స్థాపించినప్పడు ఉన్న పలువురు నేతలు వెళ్లిపోయినా, కేజ్రీవాల్‌ ప్రతిష్ఠ చెక్కుచెదరలేదు. పార్టీ అధినాయకుడిగా ఆయన స్థానం బలంగా నిలిచిపోయింది. ఆరేళ్లకుపైగా సాగుతున్న ప్రజాజీవితంలో కేజ్రీవాల్‌ ఖాదీ ధరించాల్సిన అవసరంలేని, ఓట్ల కోసం దండాలు పెట్టాల్సిన అవసరంలేని రాజకీయేతర రాజకీయ నాయకుడిలా విభిన్న ప్రతిష్ఠను సముపార్జించుకున్నట్లు విశ్లేషకుల భావన. కేజ్రీవాల్‌ను భాజపా, కాంగ్రెస్‌ పార్టీల్లోని దిగ్గజాల నుంచి వేరు చేస్తున్న కీలక ఆకర్షక శక్తి ఇదే.

భాజపా వెనక హిందూత్వ ఓట్లు పోగుపడకూడదనే ఉద్దేశంతో, అల్పసంఖ్యాక వర్గాల సంతుష్టీకరణ చర్యల నుంచి ‘ఆప్‌’ చాలా జాగ్రత్తగా దూరంగా ఉంటోంది. అంతేకాదు- ఓ అడుగు ముందుకేసి, ‘ఆప్‌’ ఒక మోస్తరు హిందూత్వను ఆశ్రయిస్తోంది. హిందువుల్లోని వృద్ధుల తీర్థయాత్రల వ్యయాల్ని భరించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడికి ఇష్టమైనదిగా పేర్కొంటూ యమునా నది ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్నీ ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినా, 370 అధికరణ రద్దుకు మాత్రం అనుకూలంగా ఓటేసింది.

స్థానిక సమస్యలపై భాజపా దృష్టి

తన సొంత బలాలకు తోడుగా, వైరి శిబిరాల్లోని బలహీనతలూ ఆమ్‌ఆద్మీ పార్టీకి కలిసొస్తున్నాయి. భాజపా, కాంగ్రెస్‌ పక్షాలు కేజ్రీవాల్‌ను ఎదుర్కోగల ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఇప్పటికీ ప్రకటించలేకపోయాయి. ఈ రెండు పార్టీల్లోనూ ముఠాతగాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. మోదీని ఎదుర్కొనేది ఎవరంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ప్రచారం చేసిన తరహాలోనే... వర్గపోరుతో సతమతమవుతున్న విపక్షాలను సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ను ఎదుర్కొనేది ఎవరంటూ ‘ఆప్‌’ ప్రశ్నలు సంధించింది. వాస్తవానికి- 370 అధికరణ రద్దు, అయోధ్యలో రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వంటి జాతీయ అంశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తూ ప్రచారం చేపట్టాలని భాజపా తొలుత భావించింది. ఈ అంశాలన్నీ హిందూ ఓటర్లు సంఘటితమయ్యేందుకు తోడ్పడతాయని విశ్వసించింది. అయితే, ఇటీవలి ఝార్ఖండ్‌ ఎన్నికల్లో స్థానిక సమస్యలను కాదని, ఇలాంటి జాతీయ అంశాల్ని తలకెత్తుకుని విఫలం కావడాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక అంశాలనే నమ్ముకోవాలని భావిస్తోంది.

దిల్లీలోని 1,731 అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కుల్ని కల్పిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్దసంఖ్యలోని ఓటర్లలో సానుకూల సంకేతాల్ని నింపింది. ఈ చర్య ద్వారా సుమారు 40 లక్షల మంది ప్రయోజనం పొందుతారని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి చెబుతున్నారు. మరోవైపు, తాము అధికారంలోకి వస్తే తాగునీరు, విద్యుత్తులను చవగ్గా అందిస్తామని భాజపా దిల్లీశాఖ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ హామీ ఇస్తున్నారు. అంతేకాదు, రాజధాని నగరంలో సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై ‘ఆప్‌’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే భాజపా ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరించడం తప్ప ఓటర్లను ఆకట్టుకునే ఇతర కార్యక్రమాలేవీ లేవనే వాదనలున్నాయి. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై విమర్శల దాడి తమకే నష్టదాయకంగా మారుతుందనే ఉద్దేశంతో భాజపా సంయమనం పాటిస్తోంది. ఈ క్రమంలోనే పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, జామియా మిలియా విశ్వవిద్యాలయం పరిధిలో హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు ‘ఆప్‌’ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌పై కేసు నమోదు చేశారు. భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా మాత్రం కాంగ్రెస్‌ పార్టీ వేర్పాటు శక్తులకు మద్దతు ఇస్తోందంటూ ఆరోపణలు గుప్పించడం గమనార్హం. భాజపాను ఓడించేందుకు ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌ను పక్కకునెట్టి, ‘ఆప్‌’ వెనకే నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక శాతం మేరకు ఉన్న క్రైస్తవ ఓటర్లదీ ఇదే బాట అని చెబుతున్నారు. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌తో మిత్రపక్షమైన భాజపా వైపే దిల్లీ సిక్కు ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

దిల్లీని వేధిస్తున్న సమస్యలకు సంబంధించి భాజపా కాంగ్రెస్‌పైనా అంతేస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ బలంగా, ఐక్యంగా ఉంటే ఆప్‌కు పోలయ్యే ఓట్లలో గణనీయమైన వాటాను పొందే అవకాశం ఉండేదేమో! మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ మరణంతో దిల్లీలో హస్తం పార్టీ వర్గాలుగా చీలిపోయింది. ‘ఈ సారి రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం ఓట్లు చీల్చే పాత్రకే పరిమితమవుతుందనే సంగతిని విజ్ఞులైన ఓటర్లు గ్రహించారు’ అని ఓ విశ్లేషకుడు పేర్కొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 22.5 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌పైనే భాజపా కొంతమేర ఆశలు పెట్టుకొంది. అంతేకాదు, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు విభిన్న తరహాలో ఓట్లు వేస్తున్న ధోరణి ఇప్పటికే పలురాష్ట్రాల్లో ప్రస్ఫుటమైందన్న సంగతి విస్మరించరానిది.

  • దిల్లీ జనాభాలో పూర్వాంచల్‌ ప్రజలు 38 లక్షల మంది ఉంటారు. 20 శాతానికి పైగా ఉన్న 25 స్థానాల్లో గెలుపోటములపై ప్రభావం చూపుతారు.
  • ముస్లిములు అయిదు సీట్లలో 40 శాతందాకా ఉండగా, 13 సీట్లలో 20 శాతం వరకు ఉన్నారు.
  • సిక్కులు ఎనిమిది సీట్లలో 20 శాతానికిపైగా ఉన్నారు.
  • నెలకు రూ.10 వేలకన్నా తక్కువ ఆర్జిస్తున్న వారు సుమారు 25 శాతందాకా ఉన్నారు.

-రాజీవ్​ రాజన్​

ABOUT THE AUTHOR

...view details