రెండేళ్లకు ఓసారి నిర్వహించే డిఫెన్స్ ఎక్స్‌పో ఇండియా-2020ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూకు వెళ్లనున్నారు మోదీ. ఐదు రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో వెయ్యికి పైగా జాతీయ, అంతర్జాతీయ రక్షణ రంగ సంస్థలు పాల్గొననున్నాయి.
ఏమిటీ ఈ ఎక్స్‌పో?
'ఇండియా-ద ఎమర్జింగ్ డిఫెన్స్ మ్యానుఫాక్ఛరింగ్ హబ్' అనే ఇతివృత్తంతో డిఫెన్స్ ఎక్స్‌పో ఇండియా-2020ని నిర్వహిస్తున్నారు. నూతన సాంకేతికత, సాంకేతిక సమస్యలకు పరిష్కారం సహా రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులు ప్రదర్శించడానికి ఒక వేదికను అందించేలా చేయడమే ప్రధాన అజెండాగా 11వ విడత డిఫెన్స్ ఎక్స్‌పో జరగనుంది. 'డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ డిఫెన్స్' అంశంపై ప్రధాన దృష్టి కోణంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో 70 దేశాలకు చెందిన ప్రతినిధులు, 172 విదేశీ రక్షణ రంగ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. మనదేశంలోని 856 రక్షణ రంగ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
'దేశ సామర్థ్యాన్ని చాటేందుకే'
రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో దేశ సామర్థ్యాన్ని చాటాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పెద్ద ఎత్తున విదేశీ సంస్థలు ఇందులో పాల్గొనడం భారత్ ఎదుగుదలను సూచిస్తోందని పేర్కొన్నారు.