పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐకి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న ఇద్దరు రక్షణ శాఖ ఉద్యోగులను రాజస్థాన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిని పట్టుకోవడానికి సైనిక గూఢచర్య సంస్థ (ఎంఐ) ఆధ్వర్యంలో ఏడాదిగా ఆపరేషన్ నడిచింది. నిందితులను వికాస్ కుమార్ (29), చిమన్ లాల్ (29)గా గుర్తించారు. వికాస్.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో సైనిక మందుగుండు సామగ్రి డిపోలో పనిచేస్తున్నాడు. బీకానేర్‌లో సైన్యానికి చెందిన ‘మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ (ఎంఎఫ్‌ఎఫ్‌ఆర్)లో కాంట్రాక్టు ఉద్యోగిగా చిమన్‌లాల్ పనిచేస్తున్నాడు. పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి ఉన్న ఈ రెండు స్థావరాలు.. వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి.
గతేడాది ప్రారంభమైన ఆపరేషన్
ఈ ‘ఇంటి దొంగల’ గుట్టును విప్పడానికి ఎంఐలోని లఖ్‌నవూ విభాగం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) ‘డెజర్ట్ చేజ్’ పేరిట గత ఏడాది ఆగస్టులో ఆపరేషన్‌ను చేపట్టాయి. అనూష్క చోప్రా అనే నకిలీ పేరుతో పాక్ గూఢచారి ఒకరు వికాస్‌కు గాలం వేసినట్లు అధికారులు గుర్తించారు. ఆమెను పాకిస్థాన్‌లోని ముల్తాన్‌కు చెందిన యువతిగా నిర్ధరించారు. బీకానేర్‌లో సైన్యం, మందుగుండు సామగ్రి, విన్యాసాలు, కాల్పుల అభ్యాసం కోసం అక్కడికి వస్తున్న సైనిక విభాగాల వివరాలు, ట్యాంకులు, ఇతర వాహనాల ఫొటోలను వికాస్.. పాక్‌కు చేరవేస్తున్నట్లు నిర్ధరించారు. ఇందుకు ప్రతిఫలంగా అతడికి నగదు అందుతోందని, సోదరుల బ్యాంకు ఖాతాల ద్వారా ఆ సొమ్మును అతడు అందుకున్నట్లు తేల్చారు. చిమన్‌లాల్ ద్వారా ఎంఎఫ్‌ఎఫ్‌ఆర్‌లో నీటి పంపిణీ రిజిస్టర్‌కు సంబంధించిన ఫొటోలను వికాస్ సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఆధారాలతో అరెస్టు
అయితే ఈలోగా కరోనా లాక్‌డౌన్ రావడంతో కేసు దర్యాప్తులో పురోగతి నిలిచిపోయింది. మే మొదటి వారంలో మరిన్ని ఆధారాలు లభించడంతో సైనిక గూఢచారి విభాగం అధికారులు, రాజస్థాన్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వికాస్, చిమన్‌లాల్‌ను సోమవారం అరెస్టు చేశారు.