భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల వేళ.. అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్‌తో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఫోన్లో సంభాషించారు. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతీయ భద్రతా అంశాలపైనా రాజ్‌నాథ్, ఎస్పర్ చర్చించారని వెల్లడించారు రక్షణ శాఖ అధికారులు. చైనా అంశంతో పాటు ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అమెరికా అభ్యర్థన మేరకే ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు వెల్లడించారు. సరిహద్దులో చైనా దూకుడుగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో భారత అవలంబిస్తున్న వైఖరిని ఎస్పర్‌కు రాజ్‌నాథ్ వివరించినట్లు చెప్పారు రక్షణ శాఖ అధికారులు.
" ఇద్దరు మంత్రులు ఇటీవల క్రమం తప్పకుండా మాట్లాడుకుంటున్నారు. ధ్వైపాక్షిక రక్షణ సహకారం, సంబంధిత అంశాలపై పలుమార్లు చర్చించారు. ఈ రోజు చైనాతో సరిహద్దు, ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో భద్రతపై చర్చలు కొనసాగించారు."
- రక్షణ శాఖ అధికార వర్గాలు