భద్రత బలగాలపై ప్రశంసలు కురిపించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సైన్యం ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తుందని కొనియాడారు. నాలుగు రోజుల పాటు భారత సైన్యం కమాండర్ల భేటీ నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించారు.
దేశ భద్రత బలగాలను, వారి ఆయుధాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందన్నారు రక్షణమంత్రి. 'ఈ రోజు దిల్లీలో జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశంలో ప్రసంగించాను. ప్రస్తుతం పరిస్థితుల్లో భారత సైన్యం వ్యవహరిస్తున్న తీరు ఎంతో గర్వంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు రాజ్నాథ్ సింగ్.
"స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ సార్వభౌమాధికారం, భద్రతకు ఎదురైన సవాళ్లను ఎదుర్కొవడంలో సైన్యం ఎన్నో విజయాలు సాధించింది. ఉగ్రవాదం, తిరుగుబాటు, శత్రు దాడులను నివారించడంలో సైన్యం ముఖ్యమైన పాత్ర పోషించింది. సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రక్షణ శాఖ కట్టుబడి ఉంది."