సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. సైనికాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సరిహద్దు వివాదంపై భారత్-చైనా విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిన తర్వాత రోజు ఈ సమీక్ష నిర్వహించటం ప్రాధాన్యం సంతరించుకుంది..
సైనికాధికారులతో రాజ్నాథ్ సమీక్ష... సరిహద్దుపై చర్చ
భారత్-చైనా విదేశాంగ మంత్రుల భేటీ జరిగిన ఒక రోజు తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. సైనికాధికారులతో సరిహద్దు ఉద్రిక్తతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి త్రిదళాధిపతి బిపిన్ రావత్, మూడు దళాలకు చెందిన అధిపతులు హాజరయ్యారు.
ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, త్రిదళాధిపతి బిపిన్ రావత్, మూడు దళాలకు చెందిన చీఫ్లు పాల్గొన్నట్లు రక్షణ శాఖాధికారులు తెలిపారు.
మాస్కో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం సమావేశమయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఐదు కీలక అంశాలపై ఒప్పందం చేసుకున్నారు. ముందుగా బలగాల ఉపసంహరణను ప్రారంభించాలని నిర్ణయించారు. ఒప్పందంలో భాగంగా కుదుర్చుకున్న ఐదు అంశాల్ని పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా సరిహద్దుల్లో శాంతి, ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని ఇరు దేశాల మంత్రులు భావిస్తున్నారు.