పాకిస్థాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఇప్పటికే రెండు ముక్కలైన పాకిస్థాన్.. వైఖరి మార్చుకోకుంటే మరిన్ని ముక్కలుకాక తప్పదని హెచ్చరించారు.
హరియాణా పటౌడీలో పర్యటించిన సందర్భంగా పాకిస్థాన్‌పై మండిపడ్డారు రాజ్‌నాథ్. అధికరణ 370 రద్దు అనంతరం పాక్ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. పాక్ పాలకులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. తీవ్రవాదులు, వారి సంస్థలను నిర్వీర్యం చేయాలని సూచించారు. తీవ్రవాదంపై పాక్ నిజాయితీగా పోరాడకుంటే భారత ప్రభుత్వమే..ఆ పనిచేస్తుందన్నారు.
" ఉగ్రవాదాన్ని రూపుమాపటానికి నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఒక వేళ తీవ్రవాదులను నిర్మూలించేందుకు నిజాయితీగా పనిచేయకూడదని అనుకుంటే.. ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడండి. కానీ, ఉగ్రవాదంపై పోరు చేసేవారితోనే భారత్ స్నేహం చేస్తుంది. భారత్‌పై బలగాలను ప్రయోగించాలనుకుంటే బలగాలతోనే బుద్ధి చెబుతుంది. తీవ్రవాదుల పట్ల మీ వైఖరి మారకుంటే మిమ్మల్ని కాపాడేందుకు ప్రపంచంలో ఎవరికీ ఆ శక్తి ఉండదు. ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లుగా రెండు ముక్కలయింది. ముందుముందు 10 ముక్కలు కావచ్చు, 5 కావచ్చు.. ఇంకా ఎన్నైనా కావచ్చు."