లీచీ... ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పండు. ముఖ్యంగా బిహార్, హరియాణా రాష్ట్రాల్లో దీనికున్న క్రేజే వేరు. అలాంటిది ఈ పండుకు ఇప్పుడు పెద్ద కష్టమొచ్చింది. లీచీ అమ్మకాలు అనూహ్యంగా పడిపోయాయి. లీచీ రైతులు కుదేలవుతున్నారు. దీనికి కారణం బిహార్‌ను కుదిపేస్తున్న 'మెదడువాపు' వ్యాధి మరణాలే.
ఏంటి సంబంధం?
బిహార్‌లో 'అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్' అంటువ్యాధితో ఇప్పటివరకు 173 మంది ప్రాణాలు కోల్పోయారు. లీచీ పండు తినడం వల్లే ఈ వ్యాధి సోకుతోందని ప్రచారం జోరందుకుంది. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ప్రభావం హరియాణాలోని లీచీ రైతులపై పడింది.
"నేను లీచీ పండ్లు అమ్ముతాను. ఒకప్పుడు 5 బస్తాలు అమ్ముడుపోయేవి. కానీ ఇప్పుడు నాలుగు బస్తాలు అలాగే పడి ఉన్నాయి. ఒక్కటే అమ్ముడుపోయింది."
--- లీచీ రైతు.
పానిపట్ నగరంలో లీచీకి డిమాండ్ 90శాతం మేర తగ్గిపోయింది. లీచీ కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుతో ప్రమాదం లేదని హామీ ఇస్తున్నారు.