దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు, కళాశాలలను పునఃప్రారంభించే అంశంపై ఏప్రిల్ 14న నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా వ్యాప్తి, తాజా పరిస్థితులపై సమీక్షించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.
34 కోట్ల మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు పోఖ్రియాల్. ఏప్రిల్ 14 తర్వాత కూడా పాఠశాలలు మూసి ఉంచినట్లయితే.. విద్యార్థులు నష్టపోకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
" ఈ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవటం చాలా కష్టం. కరోనా వ్యాప్తిపై ఏప్రిల్ 14న సమీక్షించనున్నాం. పాఠశాలలు ప్రారంభించాలా? మరికొంత కాలం మూసి ఉంచాలా అనేదానిపై అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. దేశంలో 34 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. అది అమెరికా జనాభా కంటే అధికం. వారే మాకు అతిపెద్ద సంపద. వారి భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం. "
- రమేశ్ పోఖ్రియాల్, హెచ్ఆర్డీ మంత్రి.