అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ట్రస్ట్ ఏర్పాటు అంశమై స్పందించారు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్. అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
"ట్రస్ట్ ఏవిధంగా ఏర్పాటు చేయాలి.. ఎవరెవరు సభ్యులుగా ఉండాలి.. అనేది ప్రధానమంత్రి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం."
-ప్రహ్లాద్ పటేల్, కేంద్ర సాంస్కృతిక శాఖమంత్రి
అయోధ్యపై తీర్పునిస్తూ ప్రభుత్వం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఐదెకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని మసీదుకు కేటాయించాలని ఆదేశించింది.
కేసు తీర్పును ఏకగ్రీవంగా వెలువరించిన న్యాయస్థానం.. వివాదస్పద స్థలంలోనే రాముడు జన్మించారని హిందువుల నమ్మకమని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును న్యాయశాఖ, హోంశాఖ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని సమాచారం.
'ట్రస్ట్ ఏర్పాటు అవసరం లేదు'
మందిర నిర్మాణానికి నూతన ట్రస్ట్ ఏర్పాటు అవసరం లేదన్నారు రామజన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్. ఇప్పటికే రామజన్మభూమి న్యాస్ రూపంలో ట్రస్ట్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. దానికి ఓ తుదిరూపు ఇచ్చి.. నూతన సభ్యులను చేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. రామజన్మభూమి న్యాస్.. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రస్తుతం పనిచేస్తోంది.
ఇదీ చూడండి: 'నూతన దిశ-నవీన శక్తితో చైనాతో మైత్రి'