కేరళ ఎర్నాకుళంలోని వరపూజ ప్రాంతానికి చెందిన శాంతికి ఐదుగురు పిల్లలు. పుట్టినప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో ఉన్న పిల్లల ఆస్పత్రుల ఖర్చుల కోసం లక్షలకు లక్షలు అప్పు చేసింది. ఉన్న ఇంటినీ అమ్ముకుంది. అయినా ఫలితం లేదు. వాళ్ల సమస్యలు తీరలేదు. డబ్బుల్లేక అద్దె ఇంటినీ వీడాల్సి వచ్చింది. రోడ్డు పక్కనే జీవనం సాగించాల్సిన పరిస్థితి వచ్చింది.
కొచ్చి కంటైనర్ రోడ్డు పక్కన చిన్న గుడిసె వేసుకొని అందులోనే కుటుంబంతో ఉంటోంది శాంతి. ఇటీవలే ముగ్గురు పిల్లలకు శస్త్రచికిత్సలు జరిగాయి. కానీ మందులకు డబ్బుల్లేవు. ఆమెకు ఇప్పటికే రూ. 20 లక్షలకుపైగా అప్పు ఉంది. చేసేదేమీ లేక తన గుండె, కిడ్నీలను అమ్మేందుకు సిద్ధపడింది. రోడ్డు పక్కనే 'ఆర్గాన్స్ ఫర్ సేల్' అని బోర్డు పెట్టి.. తన అవయవాలు తీసుకొని డబ్బులు ఇవ్వాలని వేడుకుంది.