తెలంగాణ

telangana

భవనం కూలిన ఘటనలో 20కి చేరిన మృతులు

By

Published : Sep 22, 2020, 5:00 AM IST

Updated : Sep 22, 2020, 11:09 AM IST

మహారాష్ట్ర భీవండిలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 20కు చేరింది. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో 20 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న స్థానిక అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

collapse
భవనం

మహారాష్ట్రలోని భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 20కు చేరింది. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. నాలుగేళ్ల బాలుడితో పాటు 20 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.

సోమవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో భివండీ పట్టణంలో పాత భవనం ఒకటి కూలిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది 43 ఏళ్లనాటిదని, ఆ భవనం యజమానిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు స్థానిక అధికారుల్ని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

నిద్రిస్తున్న సమయంలో..

ఠాణె నగరానికి 10 కి.మీల దూరంలో పటేల్‌ కాంపౌండ్‌లో ఉన్న ఈ మూడంతస్తుల భవనంలో 40 ప్లాట్లు ఉండగా.. 150 మంది నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. అందరూ నిద్రపోతున్న వేళ ఈ విషాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న కొందరిని బయటకు తీశారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

అనంతరం సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించేందుకు జాగిలాలను రంగంలోకి దించినట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌.ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. అయితే, భారీ వర్షం కారణంగా కొంత సమయం సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టు స్థానిక అధికారులు చెప్పారు. స్థానిక అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో భవనం యజమాని సయ్యద్‌ అహ్మద్‌ జిలానీపై కేసు నమోదు చేసినట్టు భీవండి డీసీపీ రాజ్‌కుమార్‌ షిండే తెలిపారు.

రూ.5లక్షల పరిహారం

ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు మంత్రి ఏకనాథ్‌ శిందే తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన అక్కడ సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. ఈ ఘటనలో మృతులకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. నగరంలో 120 ప్రమాదకరమైన భవనాలు ఉన్నట్టు గుర్తించామని, వాటిని ఖాళీ చేయించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు కమిటీని వేశారు.

ప్రధాని మోదీ, సీఎం ఉద్ధవ్‌ విచారం

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టాలని, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని అధికారుల్ని ఆదేశించారు.

ఇదీ చూడండి:కరోనా వేళ.. ఉత్తర భారతానికి మరో ముప్పు!

Last Updated : Sep 22, 2020, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details