కేరళలోని పాలక్కడ్ జిల్లాలో పైనాపిల్‌లో పేలుడు పదార్థం పెట్టి ఏనుగును చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. ముగ్గురు అనుమానితులపై దృష్టి సారించినట్టు ట్వీట్ చేశారు.
"పాలక్కడ్ జిల్లాలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మీ ఆవేదన వృథాగా మిగిలిపోదు. నేరస్థులను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాం."
-- పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి.
మరోవైపు ఈ ఘటనపై కేరళ అటవీశాఖ కూడా స్పందించింది. దర్యాప్తులో సానుకూలంగా ముందడుగు వేస్తున్నట్టు స్పష్టం చేసింది. అనేకమంది అనుమానితులను పట్టుకుని ప్రశ్నిస్తున్నట్టు వెల్లడించింది.
"ఏనుగును వేటాడారనే కారణంతో సెక్షన్ డబ్ల్యూఎల్(పీ)ఏ కింద కేసును నమోదు చేశాం. అనేకమంది అనుమానితులను విచారిస్తున్నాం. దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్(ఎస్ఐటీ) మంచి ఫలితాలతో ముందుకు సాగుతోంది. ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టం. కచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తాం."
-- అటవీశాఖ ట్వీట్.
అయితే పైనాపిల్ బాంబుతోనే ఎనుగు కింది దవడకు గాయమైనట్టు నిర్ధరించడానికి ఎలాంటి ఆధారాలు లేవని అటవీశాఖ పేర్కొంది. కానీ బాంబుతో గాయమయ్యే అవకాశముందని వెల్లడించారు.
ఏం జరిగిందంటే?
గర్భంతో ఉన్న ఓ ఏనుగు ఆహారం కోసం కేరళ మల్లప్పురంలోని ఓ గ్రామానికి వచ్చింది. కొందరు స్థానికులు ఏనుగుకు ఒక పైనాపిల్ ఆశచూపారు. ఆ పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టారు. పైనాపిల్‌ను తిన్న తర్వాత భారీ చప్పుడుతో పండు పేలిపోయింది.
రక్తమోడుతున్న నోటితోనే ఆ మూగజీవి గ్రామం వదిలి వెళ్లిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ.. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో.. ఏం చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్ నదిలోకి దిగి గొంతు తడుపుకొంది. ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించడం.. ఈగల బాధ తప్పడం వల్ల ఏనుగు అక్కడే ఉండిపోయింది. చివరికి మే 27న సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచింది.
ఈ ఘటన వెలుగు చూశాక దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. జంతువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రముఖులతో పాటు అనేకమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు.
ఈ ఘటనను రాష్ట్రం, కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ఏనుగు మృతిపై విచారణ చేపట్టేందుకు వన్యప్రాణి దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించింది.