తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాసవాన్​ మృతితో బిహార్​ ఎన్నికలపై భారీ ప్రభావం! - చిరాగ్

వర్తమాన రాజకీయాల్లో దళిత దిగ్గజంగా పేరొందిన కేంద్ర మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్‌ పాసవాన్‌ మరణం.. బిహార్​ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా ఇప్పటికే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసిన ఎల్​జేపీ.. ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద దిక్కు కోల్పోవటం.. పార్టీ వర్గాలను శోకసంద్రంలో ముంచింది. మరోవైపు బిహార్‌ ఎన్నికల తరుణంలో పాసవాన్‌ కన్నుమూయడం.. ఎల్​జేపీకి సానుభూతి ఓట్లు కురిపించే అవకాశముందంటున్నారు విశ్లేషకులు.

Death of Paswan
రాంవిలాస్​ పాసవాన్​ మరణం.. బిహార్​ ఎన్నికలపై భారీ ప్రభావం ?

By

Published : Oct 9, 2020, 6:15 PM IST

వర్తమాన రాజకీయాల్లో మాయావతి తర్వాత అత్యంత శక్తిమంతమైన దళిత నాయకుడిగా ఎదిగిన నేత రాంవిలాస్​ పాసవాన్‌. బిహార్‌ రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు. అయిదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో అలుపెరగని ప్రస్థానం సాగించారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న పాసవాన్‌ ఆసుపత్రిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతూ రసపట్టులో ఉన్న బిహార్​ ఎన్నికలను.. పాసవాన్​ మరణం కొత్త మలుపులు తిప్పబోతోంది అంటున్నారు పరిశీలకులు. గతంలో ఇందిర మరణం తర్వాత.. రాజీవ్​ గాంధీ ఘన విజయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: దళిత దిగ్గజ నేత 'పాసవాన్​' కన్నుమూత

ఇదీ చూడండి: పోలీసు అధికారి నుంచి కేంద్ర మంత్రి వరకు..

ఎన్నికలపై ప్రభావం

ప్రస్తుతం బిహార్​లో పాసవాన్​ పార్టీ ఎల్​జేపీ... శాసనసభ ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి, జేడీయూపై విమర్శలు గుప్పిస్తోంది. భాజపాతో దోస్తీ కొనసాగుతుందని చెబుతోంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో.. ఎల్​జేపీ అడుగులు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా సానుభూతి అంశం పార్టీకి కీలకం కానుంది. బిహార్​ ఎన్నికల ప్రచార శైలినే దిగ్గజ నేత మరణం మార్చేయనుంది.

ఈ నేపథ్యంలో ఎల్​జేపీకి కీలకంగా ఉన్న దళిత ఓటర్లు.. ప్రస్తుత అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​ను ఎంతమేరకు ఆదరిస్తారన్న అంశంపై పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి సీనియర్​ పాసవాన్​ మరణం.. ప్రజల్లో పార్టీపై సానుభూతి తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్​జేపీకి ఇది గేమ్​ఛేంజర్​లా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే పాసవాన్​లకు గట్టి పట్టున్న దళితుల ఓట్లు రాష్ట్రంలో 16% ఉన్నాయి.

ఇదీ చూడండి: బిహార్​ పోరులో దళిత ఓటరు ఎటువైపు?

చిరాగ్​కు పరీక్ష ?

ప్రస్తుతానికి దళితుల్లో చిరాగ్​కు ప్రత్యామ్నాయంగా మరో యువనేత లేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాంవిలాస్​ పాసవాన్​కు ప్రజల్లో ఉన్న పరపతిని చిరాగ్​ జాగ్రత్తగా కాపాడాల్సి ఉంటుందంటున్నారు. అదే సమయంలో ఈ ఎన్నికలు యువనేత నాయకత్వానికి పరీక్ష కానున్నాయి. మార్గనిర్దేశకుడైన తండ్రి లేకుండానే ఆయన బిహార్​ బరిలో పోరాడాల్సి ఉంటుంది.

మోదీతో పాసవాన్లు

జేడీయూలో గుబులు

అయితే, ఎల్​జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడి మృతి ప్రభావం.. అధికార జేడీయూపైనే అత్యధికంగా పడనుంది. ఇప్పటికే నితీశ్ పార్టీపై చిరాగ్​ నేతృత్వంలో విమర్శల వాడి పెరిగింది. సీనియర్​ పాసవాన్​ తుదిశ్వాస విడిచేందుకు కొన్ని గంటల ముందే.. నితీశ్​ తమ పార్టీని, తండ్రిని అవమానించినట్లు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు చిరాగ్​ పాసవాన్​. అంతకుముందు మీడియా సమావేశంలోనూ నితీశ్​.. రాంవిలాస్​ పాసవాన్​పై ప్రతికూల వ్యాఖ్యలే చేశారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: రాజకీయ వేడి పెంచుతోన్న 'ఎల్​జేపీ' లేఖ

భాజపా అడుగులు ఎటు ?

ప్రస్తుత పరిస్థితుల్లో రాంవిలాస్​ పాసవాన్​ మృతి తర్వాత.. ఎల్​జేపీ, చిరాగ్​ పాసవాన్​పై ఘాటు విమర్శలు చేసేందుకు ప్రత్యర్థి వర్గాలు సంకోచిస్తాయి. మరోవైపు భాజపాతో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బలమైన మైత్రి కొనసాగిస్తున్న ఎల్​జేపీ.. పొత్తుపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

అయితే, ప్రస్తుతం నితీశ్​ కుమార్​ సారథ్యంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్న భాజపా.. కేంద్రంలో కీలకంగా వ్యవహరించిన పాసవాన్​ పార్టీని దూరం పెట్టలేని పరిస్థితి. చిరాగ్​ సైతం భాజపాకు విధేయుడిగా ఉంటామని ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల పర్వం ఆసక్తికరంగా మారింది. కేవలం జేడీయూపైనే పోటీ అని ప్రకటించింది ఎల్​జేపీ. మరోవైపు జేడీయూ-భాజపా కలసి బరిలోకి దిగాయి. అయితే, అంతకుముందు ప్రచారంలో ఎల్​జేపీ 'మోదీ బొమ్మ' వాడుకోకూడదని అల్టిమేటం జారీ చేసింది భాజపా.

ఇదీ చూడండి: బిహార్​ బరి: ఎల్​జేపీ 'గారడీ'తో ఎవరికి నష్టం?

ఒంటరి పోటీలో జోరు..

2000లో పార్టీని స్థాపించిన తర్వాత బిహార్​ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినపుడే ఎల్​జేపీ సత్తా చాటింది. 2005లో జరిగిన ఎన్నికల్లో 11%పైగా ఓట్లు సాధించింది. ఎల్​జేపీలో ప్రధానంగా సంప్రదాయ ఓటర్లతో పాటు అధిక సంఖ్యలో ప్రభావవంతమైన ఉన్నత వర్గాల అభ్యర్థులకు మద్దతిచ్చే ఆనవాయితీ ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ ఎక్కువగా నితీశ్​ కుమార్​ వ్యతిరేకత ఓట్లను సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. త్రిముఖ పోరు తమకు కలిసొస్తుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సానుభూతి పార్టీకి కీలకం కానుంది.

ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోన్న బిహార్​ బరిలో.. ఇప్పటివరకు ప్రధాన పోటీ ఎన్డీఏ-మహాకూటమి మధ్యే అని భావించారు. ఇప్పుడు.. బిహార్​ రాజకీయాల్లో దిగ్గజంగా ఉన్న రాంవిలాస్​ పాసవాన్​ మరణం బిహార్ ఎన్నికలను మరింత రసకందాయంలోకి నెట్టింది. ఈ ప్రభావం ఎంతమేరకు ఉంటుందనేది నవంబర్​ 10న తేలనుంది.

ABOUT THE AUTHOR

...view details