రాజస్థాన్ కోటాలోని జేకే లాన్ ప్రభుత్వాస్పత్రిలో చిన్నారుల మరణాల సంఖ్య శనివారానికి 107కి చేరింది. గత 35 రోజుల్లో కోటా ఆసుపత్రిలో 106 మంది పిల్లలు చనిపోగా.. తాజాగా మరొకరు మృతి చెందారు. అదే సమయంలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ బృందం కోటా ఆస్పత్రిని సందర్శించింది. కమిటీ సభ్యులు ఆసుపత్రిలో మరణాల డెత్ ఆడిట్ చేస్తారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నివేదిక
జోద్పుర్ ఎయిమ్స్ పీడియాట్రిక్ హెచ్ఓడీ డాక్టర్ కుల్దీప్ సింగ్, డాక్టర్ హిమాన్షు, డాక్టర్ అనిల్, డాక్టర్ వారిషా, ఆర్బీఎస్కే సలహాదారు డాక్టర్ అరుణ్ సింగ్ సభ్యులుగా గల కేంద్ర బృందం ఆస్పత్రిని సందర్శించింది. అందులోని లోపాలకు సంబంధించి ఒక నివేదికను తయారు చేసి.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపనున్నారు.
చిన్నారుల మరణాలను తీవ్రంగా పరిగణించిన మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) శుక్రవారమే రాజస్థాన్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది.