కరోనా వైరస్‌కు తోడు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనేక చోట్ల తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అత్యంత ప్రమాదకర అంటువ్యాధులకు కారణమయ్యే ఈ వైరస్.. అసోంలో ఇప్పటికే 14,465 పందుల్ని బలిగొంది.
ఈ ఘటనతో వైరస్ నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యామ్నాయ విధానాల్లో వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా.
ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వైరస్.. పంది తినే ఆహారం, దాని లాలాజలం, రక్తం ద్వారా ఇతర వరాహాలకు వ్యాపిస్తుంది. ఈ క్రమంలో ఇతర జంతువులకూ ఈ వైరస్ సోకే అవకాశాలున్నాయి. ఇది తీవ్రమైన జ్వరం కలగజేసి మరణానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో మృతి చెందిన జీవాలను లోతైన గోతుల్లో పూడ్చిపెట్టాలని ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఖననం చేసే సమయంలో వైరస్ నిర్మూలనలో భాగంగా కళేబరాలపై బ్లీచింగ్, ఉప్పు చల్లాలని సూచించింది.
వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకుగాను పందులను సామూహికంగా చంపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా... తాము ఆ పని చేయబోమని పేర్కొంది అసోం ప్రభుత్వం. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ మానవులపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది.