ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపుర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మృతదేహాన్ని మునిసిపాలిటీ చెత్త వాహనంలో శవపరీక్షకు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటం వల్ల వెలుగులోకి వచ్చింది.
చెత్త బండిలో మృతదేహం తరలింపు బలరాంపుర్ జిల్లా ఉత్రౌలా తహసీల్ కార్యాలయానికి వెళ్లిన అన్వర్ అలీ అనే వ్యక్తి అనుమానాస్పదంగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచనతో మృతదేహాన్ని చెత్త తీసుకెళ్లే వ్యానులో తరలించారు అక్కడి సిబ్బంది.
ఈ ఘటన ఒకరోజు తర్వాత మాజీ న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇటువంటి పరిస్థితుల్లో గౌరవప్రదమైన దహన సంస్కారాలు పౌరులకు దక్కే విషయమై సుమోటోగా విచారించాలని కోరారు. గౌరవంగా మృతదేహాల ఖననం జరగేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
అసలేం జరిగింది?
ఉత్రౌలా చౌక్‌లో మృతదేహం కనిపించటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. మృతదేహం ఆనవాళ్లను గుర్తించాల్సిందిగా సిబ్బందిని ఉత్రౌలా పోలీస్ స్టేషన్ అధికారి ఆర్కే రామన్ ఆదేశించారు. చనిపోయిన వ్యక్తిని షాదుల్లానగర్‌కు చెందిన అన్వర్‌గా గుర్తించారు. అయితే అతని శవాన్ని మునిసిపల్ చెత్త బండిలో తరలించాలని అధికారులను రామన్ సూచించినట్లు తెలుస్తోంది.
చర్యలు తీసుకుంటాం..
దీనిపై బలరాంపుర్ ఎస్పీ దేవ్ రంజన్‌ను ఈ ఈటీవీ భారత్ వివరణ కోరగా.. ఘటనపై దర్యాప్తునకు అదేశించినట్లు తెలిపారు.
"సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో చూసిన తర్వాత ఈ విషయం నా దృష్టికి వచ్చింది. జిల్లా మేజిస్ట్రేట్‌తో దీనిపై చర్చించాం. ఈ దారుణమైన ఘటనతో సంబంధం ఉన్న అందరిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. వారు తప్పక మూల్యం చెల్లిస్తారు. ఇదే కాకుండా కరోనా నేపథ్యంలో ఖననానికి సంబంధించిన జాగ్రత్తలను తీసుకోవాలని సంబంధిత ఆధికారులకు నిర్దేశించాం."
- దేవ్ రంజన్ వర్మ, బలరాంపుర్ ఎస్పీ