ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లును దేశవ్యాప్తంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తూ దిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్... ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించేలా ఆంధ్రప్రదేశ్ సర్కారు దిశ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటువంటి కేసులను 21 రోజుల్లోనే పరిష్కరించి దోషులకు జీవితఖైదు లేదా మరణదండన విధించనున్నారు.
దిశ బిల్లును తక్షణమే దేశవ్యాప్తంగా తీసుకురావాలని ఆమె ప్రధాని మోదీని లేఖ ద్వారా కోరారు. మహిళల రక్షణపై కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ స్వాతి మాలివాల్ పన్నెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దిశ బిల్లును దేశవ్యాప్తంగా తీసుకొచ్చేంత వరకు తాను నిరాహార దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు. డిసెంబర్ 3న దీక్ష ప్రారంభించిన తర్వాత రెండోసారి ఆమె ప్రధానికి లేఖ రాయడం గమనార్హం.