విదేశీ సంస్థలతో ఒప్పందాలకు సంబంధించి మన దేశం అనుసరిస్తున్న ఆఫ్సెట్ విధానంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) పెదవి విరిచింది. ఆయా సంస్థల నుంచి అత్యాధునిక సాంకేతికతల బదిలీలో అది విఫలమవుతోందని పేర్కొంది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి కూడా ఫ్రాన్స్ సంస్థ దసో ఏవియేషన్, ఐరోపా క్షిపణుల తయారీసంస్థ ఎంబీడీఏ నుంచి ఇంకా సాంకేతికత మన దేశానికి అందలేదని తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను పార్లమెంటుకు కాగ్ బుధవారం సమర్పించింది.
దసో ఏవియేషన్ రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ కాగా.. ఆ విమానాలకు క్షిపణి వ్యవస్థలను ఏంబీడీఏ సరఫరా చేసింది. భారత ఆఫ్సెట్ విధానం ప్రకారం.. మన దేశంతో ఒప్పందం కుదుర్చుకునే విదేశీ సంస్థలు, విక్రయదారులు ఆ ఒప్పందం మొత్తం విలువలో 30శాతాన్ని తప్పనిసరిగా భారత్లోనే ఖర్చు చేయాలి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ), సాంకేతికత బదిలీ వంటి మార్గాల్లోనూ ఆ ప్రతిఫలాన్ని అందజేయవచ్చు.
అందని ప్రయోజనం
"రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)కు ఆధునిక సాంకేతికతను బదిలీచేయడం ద్వారా రూ.59వేల కోట్ల రఫేల్ ఒప్పందానికి సంబంధించిన 'ఆఫ్సెట్' బాధ్యతను నెరవేరుస్తామని దసో ఏవియేషన్, ఎంబీడీఏ హామీ ఇచ్చాయి. దీంతో తేలికపాటి యుద్ధ విమానాలకు అవసరమైన కావేరీ ఇంజిన్ను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ప్రతిఫలంగా పొందాలని డీఆర్డీఓ భావించింది. అయితే.. ఇప్పటివరకూ ఆ ప్రయోజనం అందనే లేదు." అని కాగ్ తెలిపింది. ఇచ్చిన హామీని నెరవేర్చకపోయినా విదేశీ సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవసరమైన మార్గాలు మన ఆఫ్సెట్ విధానంలో లేవంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.