పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింసాత్మక ఘటనలపై చర్యలకు ఉపక్రమించారు పోలీసులు. ప్రజాఆస్తుల ధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిని అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో దిల్లీ దరియాగంజ్‌లో శుక్రవారం అల్లర్లకు సంబంధించి భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్‌ను నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో జామా మసీద్ నుంచి జంతర్ మంతర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన క్రమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దరియాగంజ్ అల్లర్లకు సంబంధించి చంద్రశేఖర్ ఆజాద్‌తో కలుపుకుని ఇప్పటి వరకు మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రలో 130 మందిపై కేసులు..
పౌర చట్టానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర హింగోలి జిల్లాలోని మరాఠావాడ ప్రాంతంలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన 130 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. 20 మందిని అరెస్ట్ చేశారు. హింగోలి నగరం, కలమ్నూరి టౌన్లో శుక్రవారం జరిగిన అల్లర్లలో పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు నిరనసకారులు. ప్రజాఆస్తుల ధ్వంసంపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు.
మధ్యప్రదేశ్‌లో 35 మంది అరెస్ట్..
మధ్యప్రదేశ్‌లో పౌర చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం అల్లర్లు చెలరేగిన ఘటనలో 35 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న జరిగిన రాళ్లదాడిలో 20 మంది పోలీసులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. జబల్పుర్ నగరంలోని గోహల్పుర్, హనుమాంతల్ పోలీస్ స్టేషన్ ప్రాంతం, కోత్వాలి, అధర్తా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు పోలీసులు. భోపాల్‌లో ఆరు గంటల పాటు అంతర్జాల సేవలు నిలిపివేశారు.
ఇదీ చూడండి: 'హింసను సృష్టించకండి.. ఎవ్వరినీ వదలం'