దాదాపు రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన ఉత్తర్ప్రదేశ్ అత్యాచార బాధితురాలి మరణంపై యూపీ సహా దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను నడిరోడ్డుపై ఉరి తీయాలని ఎస్సీ సంఘాలు డిమాండ్ చేశాయి. యూపీలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు చేశాయి.
మృత్యువుతో పోరాడి...
రెండువారాలకు ముందు ఉత్తర్ప్రదేశ్ హత్రాస్ జిల్లాలోని గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురైన 19 ఏళ్ల యువతి తీవ్ర గాయాలతో మంగళవారం ఉదయం దిల్లీ ఆసుపత్రిలో మరణించింది.
నిర్భయ ఘటనను గుర్తు చేసేలా అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేశారు రాక్షసులు. ఆమె వెన్నెముకకు తీవ్ర గాయం కాగా, పక్షవాతం వచ్చింది. నాలుక తెగిపోయింది. తీవ్ర గాయాల పాలై చివరికి ప్రాణాలు విడిచింది. నిందితులపై 302 సెక్షన్ (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు యూపీ హత్రాస్ ఎస్పీ తెలిపారు.
ఆసుపత్రి ఎదుట...
ఆమె చనిపోయిన వార్త బయటకు వచ్చిన వెంటనే ఎస్సీ సంఘాలు, సామాజిక కార్యకర్తలు దిల్లీ సఫ్దార్జంగ్ ఆసుపత్రి ఎదుట, విజయ్ చౌక్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్... ఎస్సీలంతా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మౌనమేల?
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సహా మహిళా భాజపా నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఉత్తర్ప్రదేశ్ దేశానికి నేర రాజధానిగా మారిందని విమర్శించింది. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి 8 రోజులు ఎందుకు పట్టిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే ప్రశ్నించారు. రాష్ట్రంలోని 312 మంది భాజపా శాసనసభ్యుల్లో 83 మంది తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
ఆమ్ ఆద్మీ ఆందోళన
ఇది అసత్య వార్తా?
ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందిచారు.
"ప్రభుత్వం ఇది అసత్య వార్త అని చెప్పి.. బాధితురాలు చనిపోయేలా చేసింది. ఇది దురదృష్టకరం కాదు, అసత్య వార్త అంతకన్నా కాదు. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణం."