ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రంగా మారింది. వాయుగుండం ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 12 గంటల్లో వాయుగుండం తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరో 24 గంటల్లో ఈ వాయుగుండం తుపానుగా బలపడనుంది. ఈ తుపానుకు 'నివర్' అనే పేరు పెట్టనున్నారు.
పుదుచ్చేరిలోని కరైంకల్ -మామళ్లపురం మధ్య 25న తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు సుమారు 100-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చెన్నై, కడలూర్, నాగపట్నం, ఎన్నోర్, పుదుచ్చేరి సహా పలు ప్రాంతల్లో ఇప్పటికే మూడో నంబర్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
తుపాను హెచ్చరికలతో చెన్నై సహా.. పలు తుపాను ప్రభావిత ప్రాంతాలకు 6 రైళ్లను పూర్తిగా, 9 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు రైల్వే అధికారులు.
బస్సు సర్వీసులు నిలిపివేత..
తుపాను ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనాలున్న.. పుదుకొట్టాయ్, తంజావూరు, తిరువారూర్, కడలూర్ సహా పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనీ స్వామి ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బస్సు సర్వీసులు ప్రారంభించొద్దని స్పష్టం చేశారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు.