నిసర్గ తుపాను ప్రస్తుతం ఈశాన్య మహారాష్ట్ర వైపుగా కదులుతున్నట్లు ప్రకటించింది భారత వాతావరణ శాఖ. నాశిక్, ధులే, నందుర్బార్ జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని, పెనుగాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాయ్‌గఢ్ జిల్లాలోని అలీగడ్‌లో తీరం తాకిన నిసర్గ.. సాయంత్రం 4 గంటలకు తీరం దాటింది. రాయ్‌గఢ్, పాల్ఘర్, ఠాణె, ముంబయి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
"ముందుగా అనుకున్నట్లుగానే.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం తుపాను ఈశాన్య మహారాష్ట్ర వైపుగా కదులుతోంది. ఉత్తర మహారాష్ట్రలోని నాశిక్, ధులే, నందుర్బార్ జిల్లాలు ప్రభావితమవుతాయి. వాయవ్య పుణెలోని ప్రాంతాలపైనా ఈ ప్రభావం ఉంటుంది. పుణె నగరం, జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయి. కొండ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు."
- అనుపమ్ కశ్యాపి, వాతావరణ విభాగం, పుణె
ఎక్కడికక్కడ నీరు నిలవటం, కొండచరియలు విరిగిపడటం, వృక్షాలు నేలకూలటం వంటి ఘటనలు జరగొచ్చని చెప్పారు అనుపమ్. పుణె జిల్లాలో రాత్రి 8.30 గంటల వరకు దీని ప్రభావం ఉంటుందని, రాత్రి 11.30 గంటలకు పూర్తిగా సద్దుమణుగుతుందన్నారు.