భారత పశ్చిమ తీరంలో ఏర్పడిన తుపాను క్రమంగా తీరం వైపు కదులుతోంది. తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన నిసర్గ.. ఉత్తర, ఈశాన్యంవైపు కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గాలి వేగం గంటకు 20 కి.మీ నుంచి 24 కిలోమీటర్లకు పెరిగినట్లు స్పష్టం చేసింది.
మంగళవారం అర్థరాత్రి నాటికి తుపాను బలపడి తీవ్రమైన తుపానుగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్ వద్ద తుపాను తీరం దాటుతుందని స్పష్టం చేసింది. గంటకు 100-110 కి.మీల వేగంతో భీకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. రాయ్‌గఢ్ జిల్లాలో గరిష్ఠంగా గంటకు 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముంబయి నగరం సహా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఠాణె, పాల్గర్, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.
మహారాష్ట్ర అప్రమత్తం
మహారాష్ట్రలో తుపాను ప్రభావం ఉన్న పాల్గర్ జిల్లాలోని 21 వేలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. దహాను-అగర్ గ్రామంలోని దాదాపు 70 కుటుంబాలను సమీపంలోని హాస్టల్‌కు తరలించారు. తుపాను తీరం దాటే వరకు రసాయన కర్మాగారాలను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్ 4 వరకు మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని సూచించారు.
భారీ వర్షాలు
తుపాను తీరానికి చేరువలో ఉన్న వేళ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయి సహా రాయ్‌గఢ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైన వర్షం రాత్రికి ఊపందుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
సహాయక బృందాలు సిద్ధం
తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. సహాయక కార్యక్రమాల కోసం మహారాష్ట్ర, గుజరాత్ సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో 40 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. మరిన్ని అదనపు బృందాలను ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు సైన్యం, వాయు సేన బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
బఠిండా, విజయవాడ నగరాల నుంచి మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను గుజరాత్, మహారాష్ట్రలకు చేరవేశారు. ఇందులో 5 బృందాలను గుజరాత్‌లోని సూరత్‌కు పంపినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ స్పష్టం చేశారు.