కరోనా ధాటికి కకావికలమవుతున్న ముంబయిపై 'నిసర్గ' తుపాను కరుణ చూపింది! భౌతిక ఎడం పాటిస్తూ మహానగరానికి దూరంగా తీరం దాటింది. అంచనా వేసిన స్థాయిలో విధ్వంసానికి పాల్పడకుండా శాంతించింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలను పెకిలించడంతో సరిపెట్టుకుంది. దీంతో ముంబయి వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు, తుపాను తీవ్రతను ఎదుర్కొనేందుకుగాను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలా సన్నద్ధమయ్యాయి. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. సహాయక చర్యల కోసం బలగాలను మోహరించాయి.
అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన 'నిసర్గ' మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు తీరాన్ని తాకింది. ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. తుపాను తీరం దాటే ప్రక్రియ మధ్యాహ్నం 2:30 గంటలకల్లా పూర్తయింది. నిసర్గ క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ముంబయి నుంచి అలీబాగ్ దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో దేశ ఆర్థిక రాజధాని పెను ముప్పును తప్పించుకున్నట్లయింది.
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి
మహారాష్ట్రతోపాటు గుజరాత్‌పైనా నిసర్గ పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదు. అయితే- మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో గాలుల తీవ్రతకు ట్రాన్స్‌ఫార్మర్ మీద పడటంతో ఓ వ్యక్తి(58) మృత్యువాతపడ్డారు. రాయ్‌గఢ్, సింధ్‌దుర్గ్ జిల్లాల్లో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. భారీగా వర్షం కురిసింది. పుణె జిల్లాలో తుపాను సంబంధిత వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.