తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫొని టెర్రర్​: ఒడిశాలో 8లక్షల మంది తరలింపు - సైక్లోన్​

ఫొని తుపానుతో పొంచి ఉన్న ప్రమాద నష్టాన్ని తగ్గించేందుకు ఒడిశా ప్రభుత్వం భారీ ఎత్తున సహాయక చర్యలు ప్రారంభించింది. 8 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం నవీన్​ పట్నాయక్​ ఆదేశాలు జారీ చేశారు.

ఫొని

By

Published : May 2, 2019, 1:23 PM IST

Updated : May 2, 2019, 2:48 PM IST

ఒడిశా తీరాని ఫొని ముప్పు

ఫొని తుపాను రేపు సాయంత్రం ఒడిశా తీరాన్ని తాకనుంది. ఆ సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భువనేశ్వర్​లోని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో 20 సెం.మీ. వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ హెచ్చరికలతో ఒడిశా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేసింది.

8 లక్షల మంది తరలింపు

రాష్ట్రంలోని 14 జిల్లాలపై ఫొని ప్రభావం ఉండనుంది. తుపాను​ ప్రభావిత ప్రాంతాల్లోని 8 లక్షల మందిని సురక్షిత ప్రదేశాలకు చేరుస్తోంది ఒడిశా ప్రభుత్వం. దేశంలో ఈ స్థాయిలో ప్రజలను తరలించటం ఇదే మొదటిసారి. లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు ఈ రోజు సాయంత్రానికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇందుకోసం మూడు ప్రత్యేక రైళ్లను తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 880 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది ఒడిశా సర్కార్. ప్రభావిత ప్రాంతాల్లో పంచేందుకు ఇప్పటికే లక్ష ఆహార పొట్లాలు సిద్ధం చేశారు.

అత్యవసర సమావేశం

ఒడిశా తీరంలో హైఅలర్ట్​ ప్రకటించిన త్రివిధ దళాలు.. అత్యవసరంగా సమావేశమయ్యాయి. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్​ఎఫ్), ఒడిశా విపత్తు తక్షణ కార్యాచరణ దళం, అగ్నిమాపక దళాలను ప్రభావిత ప్రాంతాలకు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

అన్నీ బంద్​

ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 103 రైళ్లు రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మూడు రోజుల పాటు అన్ని విద్యాలయాలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఒడిశాలోని అన్ని నౌకాశ్రయాల్లో మూడో నెంబర్​ హెచ్చరిక జారీ చేశారు. పారాదీప్​ నౌకాశ్రయంలో కార్యకలాపాలను ఆపేశారు.

ఒడిశాలో 1999లో వచ్చిన తుపాను తర్వాత ఇదే అత్యంత ప్రమాదకరమైందని అధికారులు చెబుతున్నారు. ఆ ఏడాది తుపాను​ ధాటికి 10వేల మంది మరణించారు.

ఇదీ చూడండి: రేపు మధ్యాహ్నానికి తీరం దాటనున్న ఫొని

Last Updated : May 2, 2019, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details