ఒడిశాలోని అంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రకృతి విపత్తుతో జరిగిన నష్టం వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయంగా రూ.500 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.
అంపన్ సాయం: బంగాల్‌కు 1000 కోట్లు- ఒడిశాకు 500 కోట్లు - cyclone amphan prime minister narendra modi departs for west bengal to undertake aerial survey
18:12 May 22
15:08 May 22
ఒడిశాకు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా చేరుకున్నారు. గవర్నర్ గణేశ్ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్... భువనేశ్వర్ విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికారు.
అంపన్ ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరారు ప్రధాని. అనంతరం ఒడిశా ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
14:46 May 22
అంపన్ ధాటికి బంగాల్ లక్ష కోట్ల మేర నష్టపోయింది: మమత
ప్రధాని మోదీతో సమీక్ష సమావేశం అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ... అంపన్ తుపాను వల్ల బంగాల్‌కు లక్ష కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
13:10 May 22
రూ.1000 కోట్లు సాయం...
తుపానుతో అతలాకుతలమైన బంగాల్‌కు తక్షణ సాయంగా రూ.1000 కోట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ఇస్తామని మోదీ తెలిపారు. దేశం మొత్తం బంగాల్ ప్రజలకు తోడుగా ఉన్నారని మోదీ భరోసా ఇచ్చారు.
అంతకుముందు మోదీ బంగాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విహంగవీక్షణం చేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవనర్నర్ జగ్దీప్ ధన్కర్ సహా ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
13:02 May 22
అంపన్ తుపాను ప్రభావం, నష్టంపై బంగాల్ బసిరాత్లో సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ ధన్కర్ సహా ఇతర అధికారులతో కలసి సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ.
12:40 May 22
విహంగ వీక్షణం...
బంగాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, మమతా బెనర్జీతో కలసి విహంగవీక్షణం చేశారు. తుపాను వల్ల కలిగిన నష్టాలను ప్రధానికి.. మమత వివరిస్తున్నారు.
11:56 May 22
విహంగ వీక్షణం తరువాత!
ప్రధాని మోదీ, మమత విహంగ వీక్షణం చేసిన తరువాత ... తుపాను కలిగించిన నష్టంపై, చేపట్టాల్సిన పునరావాస, ఉపశమన చర్యలు గురించి చర్చించనున్నారని అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... తుపాను నష్టాన్ని పూడ్చడానికి ఆర్థిక ప్యాకేజీని డిమాండ్ చేసే అవకాశముందని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బంగాల్లో 80 మంది ప్రాణాలు బలిగొన్న అంపన్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
11:44 May 22
మోదీ- మమత భేటీ.. తుపాను ప్రభావంపై సమీక్ష
బంగాల్లో ప్రధాని మోదీ, మమత బెనర్జీ భేటీ అయ్యారు. తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, పునరావాసం కల్పన గురించి దీదీ.. ప్రధానికి వివరించారు.
ఈ సమావేశం తరువాత ప్రధాని మోదీ, మమతా బెనర్జీ, కేంద్రమంత్రులు కలిసి హెలీకాప్టర్‌లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేయనున్నారు.
11:16 May 22
మోదీకి స్వయంగా స్వాగతం పలికిన మమత
బంగాల్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ దంకర్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా స్వాగతం పలికారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, బాబుల్ సుప్రియో, ప్రతాప్ చంద్ర సారంగి, దేబశ్రీ చౌదరీ కూడా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో విహంగవీక్షణం చేయనున్నారు.
10:48 May 22
బంగాల్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
అంపన్ తుపాను బీభత్సానికి అతలాకుతలమైన బంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాకు చేరుకున్నారు.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విహంగ వీక్షణం ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నట్లు వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ తుపాను బంగాల్, ఒడిశాల్లో బీభత్సం సృష్టించింది. తుపాను తీరం దాటిన సమయంలో వీచిన భీకర గాలులు, భారీ వర్షాలకు 84 మంది మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు. ఒక్క బంగాల్లోనే 72 మంది మృతి చెందారని, భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించిందని సీఎం మమతాబెనర్జీ వెల్లడించారు.
TAGGED:
cyclone amphan