అంపన్ తుపాను బంగాల్ తీరంవైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. తూర్పు మిదనాపుర్లోని హల్దియా పెట్రోకెమికల్స్, ఇండియన్ ఆయిల్ రిఫైనరీ సంస్థలను అప్రమత్తం చేశారు.
తుపాను నేపథ్యంలో హల్దియా పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌లో పలు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు. పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్‌ను తీసుకోవడం ఆపేసినట్లు స్పష్టం చేశారు. అదనపు కంప్రెసర్లు, కూలింగ్ వాటర్ యూనిట్లను ప్రత్యేకంగా నడపనున్నట్లు వెల్లడించారు. కంట్రోల్ రూం సిబ్బంది మినహా ప్లాంట్‌లో ఎవరూ ఉండరని స్పష్టం చేశారు.
ఇండియన్ ఆయిల్
పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కంట్రోల్ రూంతో పాటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ఇండియన్ ఆయిల్ అధికారులు తెలిపారు. జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
విద్యుత్ శాఖ
మరోవైపు అంపన్ తుపానును ఎదుర్కొనేందుకు తగిన కార్యచరణ సిద్ధం చేసుకున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. విద్యుత్ సరఫరాను చక్కదిద్దడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసింది. భువనేశ్వర్, కోల్‌కతాలో ఉన్న పీజీసీఐఎల్, ఎన్టీపీసీలు.. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపింది.
సురక్షిత ప్రాంతాలకు 20 లక్షల మంది
తుపాను ప్రభావం ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌లోనూ ముందస్తు చర్యలు చేపట్టారు ఆ దేశ అధికారులు. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దాదాపు 20 లక్షల మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12,078 షెల్టర్ హోంలకు పంపించాలని.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఆ దేశ విపత్తు నిర్వహణ శాఖ. మంగళవారం అర్ధరాత్రిలోపు తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేయగా.. అది వీలుకాదని అధికారులు తెలిపినట్లు సమాచారం.
ఇదీ చదవండి:బలహీనపడిన అంపన్- వడివడిగా తీరంవైపు