సరిహద్దులో తుపాకులు పట్టి గస్తీ కాసే సైనికులు... ప్రజల కోసం అహోరాత్రులు శ్రమిస్తారు. మరి జనాలు కష్టం వచ్చింది రక్షించండి అంటే చూస్తూ ఉంటారా? అందుకే మేమున్నాం అంటూ రంగంలోకి దిగారు. గన్లు పట్టిన చేతులతోనే చెట్లు నరికేందుకు రంపాలు పట్టారు. తుపాను గాయాలను తుడిపేందుకు ముందుండి సేవలందిస్తున్నారు.
రాత్రీపగలు తేడాలేకుండా..
జాతీయ విపత్తు స్పందన దళాలు(ఎన్డీఆర్ఎఫ్), సైనిక బృందాలు బంగాల్లో అంపన్ తుపాను సహాయక చర్యలు ప్రారంభించాయి. తుపాను వల్ల దెబ్బతిన్న మౌలిక సౌకర్యాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్న అటవీ శాఖ, పౌర సంస్థలకు అండగా నిలిచాయి.
ఉప్పునీటి సరస్సు, బెహాలా, గోల్ పార్క్ ప్రాంతాల్లో రోడ్లమీద పడిన భారీ వృక్షాలను తొలగించడానికి.. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఆదివారం ఉదయమే రంగంలోకి దిగాయి. దక్షిణ కోల్కతాలోని పలు ప్రాంతాల్లో యంత్రాలతో చెట్లను నరికి... విద్యుత్, రవాణా, సౌకర్యాలను పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభించాయి. వారంతా రాత్రీపగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సైతం వారితో పాటు సేవలందిస్తున్నారు.