తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైకిల్​ ఫర్ ఛేంజ్​: అనారోగ్య సమస్యలు, కాలుష్యానికి ఇక చెక్​ - cycling program in Chennai

పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టి మానవుని సగటు ఆయుష్షును పెంచేందుకే కేంద్రం 'సైకిల్ ​ఫర్ ​ఛేంజ్' కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం దీన్ని చెన్నైలో అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చెన్నై మహానగర పాలక సంస్థ ఓ ప్రైవేట్ సంస్థతో జట్టుకట్టింది. నగరవ్యాప్తంగా సైక్లింగ్​ లైన్లను ఏర్పాటు చేస్తోంది.

Cycle4Change: an initiative to encourage cycling in Chennai
సైకిల్​ ఫర్​ చేంజ్​:ఆరోగ్యానికి మాాత్రమే కాదు కాలుష్య నివారణకు కూడా

By

Published : Oct 24, 2020, 3:32 PM IST

Updated : Oct 30, 2020, 2:59 PM IST

సైకిల్​ ఫర్ ఛేంజ్​: అనారోగ్య సమస్యలు, కాలుష్యానికి ఇక చెక్​

కొన్నేళ్ల క్రితం వరకు చాలా మంది తమ ప్రయాణాలకు సైకిల్​ను మాత్రమే ఉపయోగించే వారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సైకిల్​ నుంచి మూడు చక్రాల వాహనాలకు, ఆపై నాలుగు చక్రాల వాహనాలకు మారారు. ఆ క్రమంలో వాటి నుంచి వచ్చే ఉద్గారాల కారణంగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఫలితంగా అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఏటా 70 లక్షల మంది కాలుష్య కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు.

వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తీసుకువచ్చిన కార్యక్రమమే 'సైకిల్​ ఫర్​ ఛేంజ్'. దీనిలో అధికంగా యువత పాల్గొనే దిశగా అడుగులు వేస్తున్నారు నిర్వాహకులు. వాహనాల వినియోగాన్ని తగ్గించి కాలుష్యాన్ని నియంత్రించడమే కాకుండా.. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా దేశంలోని ప్రముఖ నగరాల్లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.

చెన్నైలో...

వాయు కాలుష్యం పెరగడం వల్ల కరోనా మహమ్మారికి ముందే దేశ రాజధాని దిల్లీ వంటి నగరాల్లో ప్రజలు మాస్కులు ధరించి బయటకు వచ్చేవారు. అటువంటి పరిస్థితులను దూరం చేయడానికి చెన్నైలో 'సైకిల్ ఫర్​ చేంజ్'​ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది మొత్తం నాలుగు దశల్లో అమలవుతుంది. ముందుగా ప్రజలకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తారు. తరువాత సర్వే నిర్వహిస్తారు. దీనిలో లోపాలను గుర్తించి వాటిని సరి చేసుకుంటారు. చివరగా పూర్తిస్థాయిలో చెన్నై అంతటా కార్యక్రమాన్ని అమలు చేస్తారు. చిన్న చిన్న పనులకు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సైకిల్​ని ఉపయోగించేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

మొదటి దశలో చెన్నైలోని పాండీ బజార్ వద్ద పాదచారులు, సైక్లింగ్​కు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆన్​లైన్​ పబ్లిక్​ సర్వే కోసం సర్దార్ పటేల్ రోడ్‌లో సైకిళ్లకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హ్యాండిల్​ బార్ సర్వే నిర్వహించి ఎక్కడెక్కడ సైకిళ్లకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తారు.

చెన్నైలో 'సైకిల్ ఫర్​ ఛేంజ్'​ కార్యక్రమాన్ని చెన్నై కార్పొరేషన్ స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా అమలు చేస్తున్నారు. దీనికోసం ప్రైవేట్ సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా పిల్లలకు అలవాటు చేయాలంటున్నారు సైకిల్​ ఫర్​ ఛేంజ్​ ప్రాజెక్ట్ మేనేజర్ అశ్వతి.

సైకిల్ ఫర్​ ఛేంజ్​ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి. తక్కువ దూరాలకు మోటారు వాహనాలకు బదులుగా సైకిల్​ని ఉపయోగించేలా చేయడం మా లక్ష్యం. ఇలా చేయడం వల్ల నగరంలో సైక్లిస్టులు సంఖ్య పెరుగుతుంది.

- అశ్వతి, ఎన్జీఓ ప్రాజెక్ట్ మేనేజర్.

సైక్లింగ్​ వల్ల ప్రయోజనాలు వివరిస్తే... ప్రజలు సైకిల్​ ఉపయోగించడం మొదలుపెడతారని అంటున్నారు సైక్లిస్ట్ ఫెలిక్స్ జాన్.

గత నాలుగేళ్లుగా సైక్లింగ్ చేస్తున్నా. ఆరోగ్యం కోసం సైక్లింగ్ ప్రారంభించాను. కానీ ఇప్పుడు దానిని వీడలేకపోతున్నాను. సైకిల్​ ఫర్​ ఛేంజ్​ కార్యక్రమానికి ప్రజల భాగస్వామ్యం అవసరం. జనాభా ఆధారంగా కార్పొరేషన్ సైకిల్ లైన్‌ను ఏర్పాటు చేస్తుంది. లైన్ ఏర్పాటు చేసిన తర్వాత ఉపయోగించకపోతే ఈ కార్యక్రమానికి అర్థం ఉండదు. ఈ కార్యక్రమం చెన్నైలో మరింత విస్తృతం కావాలంటే కచ్చితంగా ప్రజలు ముందుకు రావాలి. దగ్గర ప్రాంతాలకు చేరుకోవడానికి బైక్‌లు, కార్లకు బదులుగా సైకిళ్లను ఉపయోగిస్తే వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.

-ఫెలిక్స్ జాన్, సైక్లిస్ట్

ఉపయోగమేంటి.?

ప్రపంచవ్యాప్తంగా ఏటా 70లక్షల మంది వాయుకాలుష్యానికి బలవుతున్నారు. దీనికి కారణం స్వచ్ఛమైన గాలి లేకపోవడమే. కలుషిత వాయువులను పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కోవాల్సివస్తోంది. సైకిల్​ ఉపయోగించడం వల్ల కొంతమేర పర్యావరణానికి మంచి చేసిన వాళ్లం అవుతాము అని అంటున్నారు నిపుణులు. రోజుకు అరగంట పాటు సైక్లింగ్​ చేస్తే హృద్రోగ సమస్యలు కూడా దూరం అవ్వడమే కాక మెదడు చురుగ్గా పని చేస్తుంది.

ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇదీ చూడండి: దిల్లీలో ఎనిమిది నెలల గరిష్ఠానికి వాయుకాలుష్యం

Last Updated : Oct 30, 2020, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details