సరిహద్దులో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. కరోనా సంక్షోభం, సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీలో మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో మండిపడ్డారు సోనియా.
"ప్రస్తుతం దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చైనా - భారత్ మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. ప్రతి సంక్షోభానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలే కారణం. భారీ ఆర్థిక ఉద్దీపన, పేద ప్రజల చేతుల్లోకి నేరుగా డబ్బులు వెళ్లేలా చర్యలు, ఎమ్ఎస్ఎమ్ఈ లను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా ముడి చుమురు ధరలు పడిపోతున్నా.. వరుసగా 17 రోజులుగా ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరిచారు. అధికార యంత్రాంగం అంతా.. చేతుల్లో ఉన్నా మహమ్మారి విజృంభనను కట్టడి చేయడంలో మోదీ విఫలమయ్యారు."
- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు