కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగాలని ఆ పార్టీ నేతలు మరోసారి రాహుల్ గాంధీని కోరనున్నారు. ఈ మేరకు వచ్చే వారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానం చేయనుంది. అధ్యక్షుడిగా ఉండేదుకు రాహుల్ ఇష్టపడకపోతే.. నూతన అధ్యక్షుడి ఎన్నికపై నిర్ణయం తీసుకోనుంది కమిటీ.
ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు రాహుల్ సుముఖత చూపలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం అధికారిక పత్రాలపై సంతకాలు చేసేందుకు కూడా రాహుల్ ఇష్టపడటం లేదని తెలిపాయి. ఈ నేపథ్యంలో కమిటీ విన్నపాన్ని అంగికరించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకూ ఎక్కువ కాలం గాంధీ కుటుంబాలే అధ్యక్ష పదవిలో ఉన్న కాంగ్రెస్లో ఇతర వ్యక్తులు ఆ పదవిలోకి వచ్చే అవకాశం తక్కువేనంటున్నారు పార్టీ నేతలు. ఒకవేళ అధ్యక్ష పదవిలో లేకపోయినా క్రియాశీలకంగా ఉండాలని మాత్రం పార్టీ సీనియర్ నాయకులు, గాంధీ కుటుంబ విధేయులు అంటున్నారు. అధ్యక్షుడిగా వైదొలగనున్నట్లు మే 25నే ప్రకటించిన రాహుల్.. వచ్చే వారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో క్రమశిక్షణ ఉల్లంఘన ఫిర్యాదులపై త్రిసభ్య కమిటీని నియమించనుంది కాంగ్రెస్. ఉత్తర ప్రదేశ్లో అన్ని జిల్లాల కాంగ్రెస్ కమిటీలను ఇప్పటికే రద్దు చేసింది. ఆ రాష్ట్రంలో పార్టీ బాధ్యత వహిస్తోన్న ప్రియాంకా గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్ తెలిపారు.
ఇదీ చూడండి: 'గాంధీ కుటుంబం క్రియాశీలకంగా ఉండాలి'