తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరు నెలల తర్వాతే కాంగ్రెస్​కు కొత్త సారథి! - అజాద్​

sonia gandhicwc-meeting
సోనియా గాంధీసోనియాకే పగ్గాలు

By

Published : Aug 24, 2020, 10:51 AM IST

Updated : Aug 24, 2020, 9:33 PM IST

21:31 August 24

ఆజాద్​ నివాసంలో సీనియర్ నేతలు..

సీడబ్ల్యూసీ భేటీ ముగిసిన అనంతరం గులాం నబీ ఆజాద్​ నివాసానికి పలువురు సీనియర్ కాంగ్రెస్​ నేతలు వెళ్లారు. వీరిలో ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీశ్ తివారీ, శశిథరూర్, ముకుల్ వాశ్నిక్​​ తదితరులు ఉన్నారు. సీడబ్ల్యూసీ భేటీలో సీనియర్ల లేఖపై చర్చ దృష్ట్యా వీరి సమావేశానికి ప్రాధాన్యం సంతరికంచుకుంది.  

21:22 August 24

ఏఐసీసీ భేటీ వరకు సోనియానే సారథి..

వర్కింగ్ కమిటీ సమావేశంలో నాయకత్వ మార్పుపై  7 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. సోనియాగాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగాలని సభ్యులు కోరారని, అందుకు ఆమె అంగీకరించినట్లు వెల్లడించారు.  

"కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ 7 గంటలపాటు జరిగింది. మీడియాలోకానీ, బహిరంగంగానీ పార్టీ అంతర్గత విషయాలు చర్చించరాదని సీడబ్యూసీ నిర్ణయించింది. పార్టీ ప్రయోజనాలు పరిరక్షిస్తూ క్రమశిక్షణతో అంతర్గత విషయాలను పార్టీ వేదికలపైనే ప్రస్తావించాలని.. అందరినీ సీడబ్యూసీ కోరింది. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనే నిమిత్తం అవసరమైన సంస్థాగత మార్పులు చేసేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలికి సీడబ్ల్యూసీ అధికారం కట్టబెట్టింది. పరిస్థితులు అనుకూలించి.. ఏఐసీసీ సమావేశం నిర్వహించే వరకూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియాగాంధీని సీడబ్యూసీ ఏకగ్రీవంగా కోరింది."

- కేసీ వేణు గోపాల్

ఏఐసీసీ భేటీలో అధ్యక్ష ఎన్నిక

కాంగ్రెస్ అనేది పెద్ద కుటుంబమని, అభిప్రాయ భేదాలు సహజమని పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా వెల్లడించారు. లేఖ రాసిన నేతలపై ఎలాంటి కోపం లేదని సోనియా చెప్పినట్లు పేర్కొన్నారు. అవకాశం చూసుకుని ఏఐసీసీ పూర్తి సమావేశం నిర్వహిస్తామని, అదే భేటీలో అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు.  

19:22 August 24

కొత్త అధ్యక్షుడి ఎన్నిక అప్పుడే..

సీడబ్ల్యూసీ భేటీలో సోనియా, రాహుల్​పై సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారని కాంగ్రెస్ నేత పీఎల్ పూనియా తెలిపారు. పార్టీని మరికొంతకాలం నడిపించాలని సభ్యుందరూ కోరగా.. సోనియా అంగీకరించారని స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఆర్నెల్ల లోపు మరో భేటీని నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.  

"అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి స్వేచ్ఛ ఉంది. కానీ పార్టీ అంతర్గత విషయాలపై సంస్థాగతంగా చర్చ జరగాలి. బహిరంగంగా కాదు. సభ్యులు దానిపైనే ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ కుటుంబమేనని, కలిసి పార్టీని బలోపేతం చేసుకోవాలని సోనియా గాంధీ అన్నారు" అని లేఖకు సంబంధించిన విషయంపై పూనియా వివరణ ఇచ్చారు.  

19:11 August 24

నాయకత్వంపై విభేదాలు లేవు..

కాంగ్రెస్ అధినేత్రిగా సోనియా గాంధీ కొనసాగాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సీడబ్ల్యూసీ సభ్యుడు కేహెచ్​ మునియప్ప స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకత్వంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవని తెలిపారు. పార్టీ నాయకత్వంపై ఎలాంటి వివాదం లేదని గులాం నబీ ఆజాద్, ముకుల్ వాశ్నిక్, ఆనంద్ శర్మ లిఖిత పూర్వకంగా ప్రకటించారని వెల్లడించారు.  

18:27 August 24

సోనియాకే పగ్గాలు

సీనియర్ల లేఖపై వాడీవేడీగా సాగిన సీడబ్ల్యూసీ భేటీ ముగిసింది. వచ్చే ఆర్నెల్ల లోపు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. అప్పటివరకు పార్టీ బాధ్యత సోనియా గాంధీనే చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.  

పార్టీ సారథ్య బాధ్యతలపై సీడబ్ల్యూసీ భేటీలో సుదీర్ఘ సమయం చర్చించారు నేతలు. తాత్కాలిక అధ్యక్షురాలిగా మరికొంత కాలం సోనియానే కొనసాగాలని మన్మోహన్ సింగ్, ఆంటోనీ తదితర సీనియర్ నేతలు ప్రతిపాదించారు. 

17:14 August 24

సోనియా, రాహుల్​పై నమ్మకం ఉంది..

సోనియా గాంధీకి లేఖ రాయటంపై వివరణ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. పార్టీ పురోగతిలో నెలకొన్న సమస్యలు వివరించేందుకే లేఖ రాసినట్లు వివరణ ఇచ్చారు. సోనియా, రాహుల్​ నాయకత్వంపై నమ్మకం ఉందని స్పష్టం చేసినట్లు సమాచారం. 

నాయకత్వంపై సోనియా గాంధీకి లేఖ రాసిన వారిపై పార్టీ రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని సీడబ్ల్యూసీలో అంబికా సోని అన్నట్లు తెలుస్తోంది. మా పరిమితులను అనుసరించే లేఖ రాశామని, క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించినట్లు భావిస్తే తమపై చర్యలు తీసుకోవచ్చని ఆజాద్, ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. 

15:44 August 24

రాహుల్ అలా అనలేదు: ఆజాద్

మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్​ కూడా రాహుల్ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు. సీడబ్ల్యూసీలో కానీ, బయట కానీ భాజపాకు మద్దతుగా సీనియర్లు లేఖ రాశారని రాహుల్ అనలేదని స్పష్టం చేశారు. 

15:25 August 24

ఆ పార్టీని ఎవరూ కాపాడలేరు: చౌహాన్​

కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​ స్పందించారు. కాంగ్రెస్​లో ఎవరైనా గొంతెత్తితే వాళ్లను భాజపాకు ముడిపెడతారని విమర్శించారు.  

"జ్యోతిరాదిత్య సింధియా గొంతెత్తినప్పుడు భాజపాతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇప్పుడు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్​ వంటి నేతలు పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు కావాలని కోరితే.. అదే మాట అంటున్నారు. ఇలాంటి పార్టీని ఎవరూ కాపాడలేరు!"

- శివరాజ్ సింగ్ చౌహాన్​, ఎంపీ సీఎం

15:15 August 24

రాహుల్ వివరణతో సిబల్ ట్వీట్ ఉపసంహరణ..  

భాజపాతో కుమ్మక్కై సోనియాకు కొందరు సీనియర్లు లేఖ రాశారని సీడబ్ల్యూసీలో రాహుల్‌ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు రావడంతో ట్విట్టర్‌ వేదికగా స్పందించిన కపిల్‌ సిబల్‌ ఆ తర్వాత వెంటనే వెనక్కి తగ్గారు.  

గడిచిన 30 ఏళ్లలో ఏ రోజూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఏ విషయంలోను వ్యవహరించలేదని, మాట్లాడలేదని తొలుత కపిల్‌ సిబల్‌ ట్వీట్‌ చేశారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్ పక్షానే నిలిచామని తెలిపారు. మణిపుర్​లో భాజపాను గద్దె దించేందుకు పార్టీ పక్షాన పోరాడామన్నారు. అయినా తాము భాజపాతో కుమ్మక్కయ్యామా అని కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు.  

ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ట్వీట్‌ చేసిన కపిల్‌ సిబల్‌...భాజపాతో కుమ్మక్కైనట్లు తాను వ్యాఖ్యలు చేయలేదని రాహుల్‌ స్వయంతో తనతో చెప్పినట్లు తెలిపారు. అందుకే అంతకు ముందు చేసిన ట్వీట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

14:58 August 24

కాంగ్రెస్ పని పూర్తయింది: ఉమాభారతి

సీడబ్ల్యూసీ భేటీలో సీనియర్​ నేతల లేఖ వివాదాస్పదమైన నేపథ్యంలో కాంగ్రెస్​పై భాజపా నాయకురాలు ఉమాభారతి తీవ్ర విమర్శలు చేశారు.

"గాంధీ- నెహ్రూ కుటుంబం ఉనికి సంక్షోభంలో ఉంది. వారి రాజకీయ ఆధిపత్యం ముగిసింది. కాంగ్రెస్​ పని పూర్తయింది. ఇప్పుడు కాంగ్రెస్​ నేతలు ఎలా వ్యవహరిస్తారన్నదే అసలు విషయం. కాంగ్రెస్​ మళ్లీ గాంధీ చేతుల్లోకి రావాలి. కానీ, ఎలాంటి 'విదేశీ' అంశం లేని 'స్వదేశీ' గాంధీ కావాలి."

- ఉమాభారతి

13:58 August 24

కొత్త ట్విస్ట్...

కాంగ్రెస్​ వర్కింగ్ కమిటీ సమావేశం అత్యంత నాటకీయంగా సాగుతోంది. నాయకత్వం మార్పునకు సంబంధించి సోనియా గాంధీకి పార్టీ సీనియర్లు లేఖ రాసిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆ లేఖపై అగ్రనేత రాహుల్​ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారని వార్తలు రాగా... అవన్నీ అవాస్తమవి తాజాగా ప్రకటించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సిబల్ ట్వీట్ ఉపసంహరణ

అటు సీనియర్ నేత కపిల్ సిబల్ సైతం తన అభిప్రాయం మార్చుకున్నట్లు ట్వీట్ చేశారు.

"కొందరు భాజపాతో కుమ్మక్కు అయ్యారు" అని రాహుల్​ అనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ కాసేపటికే క్రితమే ట్వీట్ చేశారు సిబల్. అయితే... రాహుల్​ తనతో వ్యక్తిగతంగా మాట్లాడారని, అసలు తను అలా అనలేదని స్పష్టం చేశారని చెప్పారు. అందుకే ఇంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు సిబల్.

13:08 August 24

స్పందించిన సీనియర్లు

  • రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన గులాంనబీ ఆజాద్
  • ఆరోపణలు నిరూపిస్తే పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమన్న ఆజాద్
  • సోనియానే కొనసాగాలని కోరిన మన్మోహన్, ఆంటోనీ, పలువురు సీనియర్లు
  • అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేది లేదని తేల్చి చెప్పిన సోనియా
  • కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకు కొనసాగాలని సోనియాను కోరిన సీనియర్లు
  • రాహుల్ వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో స్పందించిన కపిల్ సిబల్
  • 30 ఏళ్లుగా భాజపాకు ఎప్పుడూ అనుకూలంగా మాట్లాడలేదన్న కపిల్ సిబల్‌
  • రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్ పక్షానే నిలిచామన్న సిబల్‌
  • మణిపూర్‌లో భాజపాను గద్దె దించేందుకు పార్టీ పక్షాన పోరాడామన్న సిబల్‌
  • ఇన్ని చేసినా భాజపాతో కుమ్మక్కయ్యామని రాహుల్ వ్యాఖ్యానించారన్న సిబల్‌

12:53 August 24

సీనియర్లపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

  • కాంగ్రెస్‌ సీనియర్లపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
  • లేఖ రాయడం వెనుక ఉద్దేశాలను తీవ్రంగా ప్రశ్నించిన రాహుల్‌
  • భాజపాతో కుమ్మక్కై లేఖ రాశారా అని సీనియర్లను నిలదీసిన రాహుల్‌
  • సమయం, సందర్భం లేకుండా లేఖ రాయడంపై రాహుల్‌ తీవ్ర ఆగ్రహం
  • నేను రాజీనామా చేశాక అధ్యక్ష బాధ్యత చేపట్టేందుకు సోనియా విముఖత చూపారు: రాహుల్‌
  • సీడబ్ల్యూసీ సభ్యుల ప్రోద్బలంతో సోనియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు: రాహుల్‌
  • సోనియా ఆస్పత్రిలో చేరిన సమయంలో లేఖ ఎలా రాస్తారు?: రాహుల్‌
  • పార్టీ అంతర్గత వ్యవహారాలు బయటకు ఎలా వెళ్తున్నాయి?: రాహుల్‌
  • సంక్షోభ సమయంలో నాయకత్వంపై విమర్శలు చేస్తూ లేఖలు భావ్యమా: రాహుల్‌
  • పార్టీ అంతర్గత అంశాలను బహిరంగంగా ఎందుకు చర్చిస్తున్నారు?: రాహుల్‌
  • రాహుల్ లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇస్తున్న గులాంనబీ ఆజాద్

12:22 August 24

కాంగ్రెస్​ కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకు సోనియా గాంధీనే పదవిలో కొనసాగాలని భేటీలో  మన్మోహన్​ సింగ్​, ఏకే ఆంటోనీ కోరారు.

12:17 August 24

  • 23 మంది సీనియర్లు రాసిన లేఖపై సమావేశంలో వాడీవేడీ చర్చ
  • లేఖ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించిన కె.సి.వేణుగోపాల్
  • సీడబ్ల్యూసీ భేటీలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ
  • సోనియా అనారోగ్యంతో ఉన్నప్పుడు లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందన్న రాహుల్
  • తనకు వచ్చిన లేఖను వేణుగోపాల్‌కు ఇచ్చిన సోనియాగాంధీ
  • 23 మంది సీనియర్లు రాసిన లేఖను చదివి వినిపించిన వేణుగోపాల్
  • సోనియాతో పాటు 10 జనపథ్ నుంచే భేటీలో పాల్గొన్న వేణుగోపాల్

12:07 August 24

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోండి..

కాంగ్రెస్​ నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని పార్టీ నేతలను సోనియా కోరారు. 

12:01 August 24

లేఖపై అసంతృప్తి..

కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చాలని కొందరు నేతలు రాసిన లేఖపై సీడబ్ల్యూసీ భేటీలో మన్మోహన్​ సింగ్, ఏకే ఆంటోని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

11:39 August 24

కాంగ్రెస్​ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని సోనియాగాంధీ సమావేశంలో కోరారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. సోనియా తన పదవిలో యథావిధిగా కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్​ విజ్ఞప్తి చేశారు. సమావేశానికి ప్రియాంక గాంధీ వాద్రా, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్​ సింగ్ సహా ముఖ్యనేతలంతా హాజరయ్యారు. 

11:21 August 24

సమావేశం ప్రారంభం
కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీడబ్ల్యూసీ సభ్యులు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వ సంక్షోభం నేపథ్యంలో భేటీకీ ప్రాధాన్యం నేలకొంది. కాంగ్రెస్‌ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కమిటీ చర్చించనుంది. 

10:59 August 24

'సోనియా లేదా రాహుల్ సారథ్యం వహించాలి'

గాంధీ కుటుంబసభ్యులే కాంగ్రెస్​కు  సారథ్యం వహించాలని పలువురు ఎంపీలు, శాసనసభ్యుల లేఖలు అధిష్ఠానానికి లేఖలు రాశారు. 50 మంది కాంగ్రెస్‌ ఎంపీలు, 500 మందికి పైగా ఎమ్మెల్యేలు, ముగ్గురు కాంగ్రెస్‌ సీఎంలు, 30 మంది రాష్ట్ర అధ్యక్షులు లేఖలు రాసిన వారిలో ఉన్నారు. గాంధీ కుటుంబ నాయకత్వంపై తమకు విశ్వాసం ఉన్నట్లు ఆ లేఖలో వెల్లడించారు. సోనియా లేదా రాహుల్ మాత్రమే నాయకత్వం వహించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

10:52 August 24

సోనియాగాంధీ రాజీనామా ఆమోదించాల్సి వస్తే

సీడబ్ల్యూసీ సమావేశంలో తాత్కాలిక అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో సోనియా తప్పుకునేందుకు రాజీనామా ఇవ్వనున్నట్లు కొందరు నేతలు సైతం చెబుతున్నారు. అయితే సోనియా రాజీనామా ఆమోదించకూడదని కొందరు సీనియర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సోనియాగాంధీ రాజీనామా ఆమోదించాల్సి వస్తే.. ఆ బాధ్యత రాహుల్ పై ఉంచాలనే ప్రతిపాదనను  సీడబ్ల్యూసీ సభ్యులు చేయనున్నారు.

10:39 August 24

సీడబ్ల్యూసీ భేటీ.. సారథి ఎంపికపై చర్చ

134 ఏళ్ల చరిత్రలో ఎన్నడూలేని అంతర్గత సంక్షోభాన్ని కాంగ్రెస్​ ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ నూతన నాయకత్వంపై మల్లగుల్లాలు పడుతోంది. సారథ్య బాధ్యతల నుంచి అధినేత్రి సోనియా గాంధీ తప్పుకుంటారనే ప్రచారం నేపథ్యంలో కాసేపట్లో దిల్లీలో జరిగే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంపైనే అందరి దృష్టి నెలకొంది. సమష్టి నాయకత్వం కోసం సీనియర్లు, రాహుల్ గాంధీని తిరిగి అధ్యక్షుడిని చేయాలని జూనియర్లు పట్టుబడుతున్న వేళ సీడబ్ల్యూసీ సమావేశం తీసుకోనున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Last Updated : Aug 24, 2020, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details