దిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమైంది. యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే సహా పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
సీడబ్ల్యూసీ భేటీ.. రాహుల్ రాజీనామాపై ఉత్కంఠ - RAHUL
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ చేతిలో తీవ్ర పరాభవం చవిచూసిన కాంగ్రెస్.. తదుపరి కార్యచరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా దిల్లీలో పార్టీ సీనియర్ నేతలతో కూడిన సీడబ్ల్యూసీ సమావేశమైంది. కాంగ్రెస్ భవితవ్యంపై నేతలు చర్చిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరాజయం ఎదురైంది. ఎన్డీఏ ప్రభంజనం ముందు.. 82 స్థానాల్లోనే నెగ్గింది యూపీఏ. ఓటమిపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్చిస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సీడబ్ల్యూసీ సమావేశంలోనే రాహుల్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, వాటిని ఏ విధంగా అధిగమించి పార్టీని బలోపేతం చేయాలనే అంశంపై సీనియర్ నేతలు చర్చించనున్నారు.