భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వీవీఐపీలు ప్రయాణించేందుకు కొనుగోలు చేసిన ప్రత్యేకమైన, ఖరీదైన విమానం బోయింగ్ 777 భారత్‌కు చేరింది. టెక్సాస్‌లో బయలుదేరి దిల్లీలోని విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ల్యాండ్ అయింది.
బోయింగ్ సంస్థ నుంచి ఎయిర్ ఇండియాకు ఈ ఏడాది జులైలోనే విమానం అందాల్సి ఉంది. కానీ రెండు సార్లు వాయిదా పడింది. తొలిసారి కరోనా మహమ్మారి కారణంగా ఆగస్టుకు వాయిదా వేయగా.. సాంకేతిక కారణాలతో మరో నెల రోజులు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. ప్రముఖుల కోసం కొనుగోలు చేసిన మరో విమానం బోయింగ్ 777 భారత్‌కు త్వరలోనే చేరుకుంటుందని చెప్పారు.
విమాన విశేషాలు ..
- 2018లో రెండు బోయింగ్ 777 విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. వీటిని ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉపయోగిస్తారు. వీరితోపాటు ఇతర ఉన్నతస్థాయి నేతలకూ ఈ శ్రేణి విమానాల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. వీటి కోసం ఏకంగా రూ.8,458 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ విమానాలు ఫ్లోరిడాలోని బోయింగ్ ప్రధాన కార్యాలయంలో తయారవుతున్నాయి.
- ఈ రెండు బోయింగ్ విమానాలు భారత వాయిసేన (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో ఉంటాయి. తొలుత ఎయిర్ ఇండియా పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం దాన్ని ఐఏఎఫ్ పేరుకు మార్చారు. ప్రస్తుతం మోదీ, కోవింద్ ప్రయాణించే బోయింగ్ 747 విమానాలకు ఎయిర్ఇండియా ఉద్యోగులే పైలట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ బోయింగ్ 777ను మాత్రం భారత వాయుసేన పైలట్లు నడుపుతారు. ఇందుకోసం 4 నుంచి 6 ఐఏఎఫ్ పైలట్లకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది.
- ఈ విమానాల్లో మొత్తం 342 సీట్లు ఉంటాయి. 4 ఫస్ట్‌క్లాస్, 35 బిజినెస్ క్లాస్, 303 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. విమానం పొడవు.. 242.2 అడుగులు. బరువు 143 టన్నులు. ఒక్కో రెక్క పొడవు 212.7 అడుగులు. ఇది 43,100 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. ఇందులో అమర్చిన జనరల్ ఎలక్ట్రిక్ జీఈ 90-115 బీఎల్ ఇంజిన్ చాలా శక్తిమంతమైనది. ఇది 1.15 లక్షల పౌండ్ల బరువును మోసుకెళ్లగలదు.
- బోయింగ్-777లో లగ్జరీ ఫర్నిచర్ ఉంటుంది. భద్రత ప్రధానంగా రూపొందించిన ఈ విమానంలో ప్రత్యేకమైన క్షిపణి నిరోధక వ్యవస్థను నిక్షిప్తం చేశారు. అమెరికా రక్షణ సహకార ఏజెన్సీ (డీఎస్‌సీఏ) రూపొందించిన లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్మీజర్స్ (ఎల్ఏఐఆర్సీఎం), స్వీయ రక్షణ సూట్లు (ఎస్పీఎస్) ఉంటాయి. వీటికి క్షిపణి హెచ్చరిక సెన్సార్లు (డబ్ల్యూఎంఎస్), కంట్రోల్ ఇంటర్ఫేస్ యూనిట్(సీఐయూ) అదనం. వీటి సాయంతో ఇన్ఫ్రారెడ్ క్షిపణులను పసిగట్టి.. నియంత్రించొచ్చు. వీటన్నింటికి సంబంధించిన శిక్షణను పైలట్లకు ఇస్తారు. ఈ సాంకేతికతలను అమెరికా ఢిఫెన్స్ సెక్యూరిటీ కార్పొరేషన్ ఏజెన్సీ(డీఎస్‌సీఏ) అందించింది. రెండు రక్షణ వ్యవస్థలను భారత్‌కు రూ.1,357 కోట్లకు అమ్మేందుకు 2019 ఫిబ్రవరిలో అమెరికా అంగీకరించింది. అణుబాంబు ప్రయోగించినప్పుడు వచ్చే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ వల్ల విమానంలోని సాంకేతిక వ్యవస్థ చెడిపోకుండా.. 238 మైళ్ల పొడవున్న వైరింగ్తో అన్ని ఎలక్ట్రానిక్స్‌కు భద్రత ఏర్పరిచారు.
- ప్రపంచంలోని అత్యంత ఖరీదైన విమానాల్లో ఇదొకటి. ఇందులో కాన్ఫరెన్స్ రూమ్, వీఐపీ గదులు, వైఫై, అత్యవసర వైద్య సదుపాయం కోసం ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ యూనిట్ ఉంటాయి. ఇది సాధారణంగా ప్రయాణికుల కోసం తయారు చేస్తారు. అయితే వాటిని రీమోడల్ చేసి వీవీఐపీల కోసం సిద్ధం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ స్ఫూర్తితో దీనికి అన్ని రకాల హంగులు కల్పించారు.
- ఈ విశిష్టమైన భద్రతా అంశాలతో పాటు ప్రత్యేక శైలిలో సమావేశ గది, వీఐపీ సూట్లు, వైఫై సౌకర్యం ఉంటాయి. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో రోగి రవాణా వ్యవస్థ కూడా ఇందులో ఉంది.
ఇదీ చూడండి:ఈ నెల 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు