రాజకీయనాయకులు మాత్రం అధికారంలో ఉండేది అయిదేళ్లు మాత్రమే! కానీ ప్రభుత్వోద్యోగులు సుమారు 30 ఏళ్లపాటు సర్వీసులో కొనసాగే అవకాశం ఉంటుంది. అవినీతికి పాల్పడి చిక్కినా, సత్వర విచారణలు, తగిన శిక్షలు లేకపోవడంతో వారు మళ్ళీ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుండటమే విషాదం.
ఈ పెడధోరణి వల్లే పాలన వ్యవస్థల్లో అవినీతి నలుమూలలా వ్యాపించిందని 1964లోనే సంతానం కమిటీ నివేదిక స్పష్టీకరించింది. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం పదిహేను పైసలు మాత్రమే పేదలకు చేరుతున్నాయని 1985లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ వాపోయారు. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్- 2018’ నివేదిక ప్రకారం ప్రపంచంలో డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, సింగపూర్, స్వీడన్ లాంటి దేశాలు అవినీతిరహితంగా అంతర్జాతీయ మన్ననలు అందుకుంటున్నాయి. భారత్‌లో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. ప్రభుత్వ కార్యాలయాలు తీవ్రస్థాయిలో అవినీతిలో కూరుకుపోతున్నాయి.
అవినీతి సూచీలో 180 దేశాలతో పోటీపడి 78వ స్థానంలో నిలవడమే అందుకు దాఖలా. రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగుల అవినీతి అక్రమాలు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయన్నది సుస్పష్టం. అందువల్లే అవినీతి కేసుల్లో సత్వర విచారణలు జరిపి న్యాయస్థానాలు నిందితులకు కఠిన శిక్షలు వేయడం, ప్రభుత్వమూ శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించడం చాలా అవసరం. విచారణలో జాప్యం, శిక్షల విషయంలో తాత్సార ధోరణులు అవినీతిపరులు మరింత పేట్రేగిపోవడానికి దోహదం చేస్తున్నాయి.
తీవ్ర జాప్యమే శాపం
ప్రభుత్వరంగాల్లో జరిగే అవినీతి, అక్రమాలను అరికట్టడానికి 1964లో కేంద్ర నిఘా సంస్థ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) ఏర్పాటైంది. నిఘా వ్యవహారాలకు సంబంధించి దేశంలో అత్యున్నత సంస్థ ఇదే. దీని పరిధిలో స్వీకరించిన దర్యాప్తులన్నింటిలో సమగ్ర విచారణ చేపట్టి, నిందితులపై చర్యలు తీసుకుంటుంది. కఠినమైన శిక్షల కోసం న్యాయస్థానాలనూ ఆశ్రయిస్తుంది. అయితే, ఆశించిన స్థాయిలో కాకపోయినా కమిషన్ ఏర్పాటు వల్ల కొంతమేర ఫలితాలు వస్తున్నాయి. అవినీతిపరులకు శిక్షలు పడటంలో తీవ్ర జాప్యమే ఆందోళనకరంగా ఉంది.
కేంద్ర నిఘా సంస్థ 2014-18 మధ్యకాలంలో అవినీతిపరులపై 1.97 లక్షల దరఖాస్తులు స్వీకరించింది. వాటిలో దర్యాప్తునకు ఉపయోగపడేవాటిలో 98 శాతం కేసులు పరిష్కారమయ్యాయి. అధికారులపై కొందరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కానీ, సరైన సాక్ష్యాధారాలను అందించలేకపోతున్నారు. దీనివల్ల సుమారు 20 శాతం మేర దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. గత అయిదేళ్లలో సరైన ఆధారాలతో దర్యాప్తు చేసి 13,766 మంది అవినీతిపరులకు నిఘా సంస్థ శిక్షలు విధించింది. అందులో అత్యధికంగా 51.6 శాతం మందికి భారీ జరిమానాలు విధించింది. పలువురి నుంచి అవినీతి సొమ్మునూ తిరిగి వసూలు చేసింది. సుమారు 14.2 శాతం మందిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. దీనివల్ల వారికి సర్వీసుపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి.
కేంద్ర నిఘా సంస్థ వార్షిక నివేదిక (2018) ప్రకారం రైల్వే, ప్రభుత్వరంగ బ్యాంకులు, పౌరసరఫరా, గృహ నిర్మాణ తదితర సంస్థల్లో భారీగా అవినీతి చోటుచేసుకుంటోంది. రైల్వేలో నిర్మాణ రంగానికి సంబంధించి వేల కోట్ల రూపాయల మేర పనులు జరుగుతుంటాయి. వాటిని దక్కించుకోవడానికి గుత్తేదారులు పోటీపడుతుంటారు. ఎవరు తక్కువగా ‘కోట్’ చేస్తే వారికి పనులు దక్కే అవకాశం ఉంటుంది. ఆ నిబంధనలను అధికారులు గోప్యంగా ఉంచాలి. పలువురు అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. గుత్తేదారులతో సత్సంబంధాలు ఏర్పరచుకుని రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నారు.
దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. బ్యాంకింగ్ రంగంలో అధికారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ వేల కోట్ల రూపాయల రుణాలు లబ్ధిదారులకు అప్పనంగా చెల్లిస్తున్నారు. ఈ లావాదేవీల్లో బ్యాంకు అధికారులకు రావాల్సిన వాటా అడ్డదారిలో ముడుతుందనే విషయం బహిరంగ రహస్యమే! అవినీతి, అక్రమాల కేసుల్లో నిరుడు కెనరా బ్యాంకులో 83 మంది, భారతీయ స్టేట్ బ్యాంకులో 72 మంది, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 63 మందిపై నేరారోపణలు రుజువయ్యాయి. ప్రస్తుతం వారంతా జైలుశిక్షలు అనుభవిస్తున్నారు.