పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో.. అసోం సహా పలు ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను తాత్కాలికంగా సడలించారు. నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతున్న దిబ్రూగఢ్‌లో నిషేధాజ్ఞలను 5 గంటలపాటు(ఇవాళ ఉదయం 8 నుంచి ఒంటి గంటవరకు) సడలించారు. గువాహటి కేంద్రంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సైన్యం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది.
ఆమరణ దీక్షకు అన్ని వర్గాల మద్దతు
ప్రధాన విద్యార్థి సంఘం ఏఏఎస్‌యూ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు అన్నివర్గాలు మద్దతు ఇస్తున్నాయి. కళాకారులు, గాయకులు, సినీనటులు దీక్షలో పాల్గొంటున్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, తమ లక్ష్యం నెరవేరే వరకూ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థి సంఘం నేతలు స్పష్టం చేశారు.
కాల్పుల్లో ముగ్గురు మృతి..
అసోం ప్రజల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గురువారం ప్రధాని మోదీ చేసిన ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన తరువాత గువాహటిలో గురువారం కర్ఫ్యూ నిబంధనలను ఉల్లఘించి రోడ్లపైకి వచ్చిన వారిని చెదరగొట్టేందుకు సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.
అంతర్జాల సేవలు బంద్..
శాంతిభద్రతల పరిరక్షణ, వదంతుల వ్యాప్తిని నిరోధించేందుకుగాను పది జిల్లాల్లో నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి అంతర్జాలం సేవలపై నిషేధాన్ని మరో 48 గంటలపాటు పొడిగించారు.
ఆందోళనల మధ్యనే ఆమోదం
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించే ఈ బిల్లును ప్రతిపక్షాలతోపాటు ఈశాన్యరాష్ట్రాలు ముఖ్యం అసోంవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లను ఈనెల 9న లోక్‌సభ, 11న రాజ్యసభ ఆమోదించగా.... రాష్ట్రపతి నిన్న ఆమోదముద్ర వేశారు. దీంతో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు చట్టరూపం దాల్చింది.