దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,336 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18,601కు చేరగా.. మరణించిన వారి సంఖ్య 590కి చేరినట్లు స్పష్టం చేసింది. వైరస్ నుంచి ఇప్పటి వరకు 3251 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 14,759 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
కాస్త ఊరట
23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 59 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదని కేంద్ర వైద్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. కేసులు రెట్టింపు కావడానికి పట్టే వేగం నెమ్మదించినట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు ముందు 3.5 రోజుల్లో కేసులు రెట్టింపు కాగా.. ప్రస్తుతం 7.5 రోజుల్లో రెట్టింపు అవుతున్నట్లు తెలిపారు. గత శుక్రవారం ఈ సంఖ్య 6.2గా ఉండటం గమనార్హం. కేరళలో కేసులు రెట్టింపు కావడానికి 72.2 రోజులు పడుతున్నట్లు అగర్వాల్ స్పష్టం చేశారు.
నిబంధనలు సడలింపు
కేసులు తగ్గుముఖం పట్టిన రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనలను సడలిస్తున్నాయి. గోవా, కేరళ రాష్ట్రాల్లో ఆంక్షలకు మినహాయింపులు ఇచ్చాయి. బస్సులు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతిస్తూ కేరళ నిర్ణయం తీసుకుంది. అయితే ఇవన్నీ లాక్డౌన్ మార్గదర్శకాలను నీరుగార్చేలా ఉన్నాయని కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్రానికి లేఖ రాసింది. దీంతో నిర్ణయాన్ని మార్చుకున్న కేరళ... చివరకు బస్సులు తిరగడం సహా రెస్టారెంట్లపై నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది.
మహారాష్ట్ర
దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన మహరాష్ట్రలో మరో 466 మంది బాధితులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,666కి చేరినట్లు స్పష్టం చేశారు. సోమవారం 9 మంది కరోనా బాధితులు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 232కి చేరినట్లు వెల్లడించారు. 572 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపారు.
వైరస్‌కు కేంద్రంగా మారిన ముంబయి నగరంలో కేసుల సంఖ్య 3 వేలు దాటింది. కొత్తగా నమోదైన 155 కేసులతో.. మొత్తం బాధితుల సంఖ్య 3090కి చేరినట్లు బృహాన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. మొత్తం మరణాల సంఖ్య 138కి చేరినట్లు పేర్కొంది. సోమవారం 84 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 394 మంది కోలుకున్నట్లు వెల్లడించింది.
2 వేలకు చేరువలో గుజరాత్
గత 24 గంటల వ్యవధిలో గుజరాత్లో కొత్తగా నమోదైన 201 కేసులతో బాధితుల సంఖ్య 1,939కి చేరినట్లు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లోనే అత్యధికంగా 152 మంది బాధితులను గుర్తించినట్లు వెల్లడించారు. సోమవారం ఎనిమిది మంది మరణించడం వల్ల మృతుల సంఖ్య 71కి చేరినట్లు తెలిపారు.