తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్భిణిని 6 కిలోమీటర్లు మోసుకెళ్లిన సీఆర్పీఎఫ్​ బృందం - Bijapur jungles

ఛత్తీస్​గఢ్​లో ఓ నిండు గర్భిణిని సరైన సమయంలో ఆసుపత్రిలో చేర్పించి మానవతను చాటుకుంది సీఆర్పీఎఫ్ బృందం. ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేనందున గర్భిణిని దట్టమైన అడవి గుండానే ఆరు కిలోమీటర్లు భుజస్కందాలపై మోసుకెళ్లి మహిళను ప్రాణాపాయం నుంచి రక్షించారు జవాన్లు.

CRPF team carry pregnant woman
మానవతను చాటుకున్న సీఆర్పీఎఫ్​ బృందం

By

Published : Jan 22, 2020, 10:40 AM IST

Updated : Feb 17, 2020, 11:14 PM IST

ఛత్తీస్​గఢ్​ బిజాపుర్​ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్​ బృందం ఓ నిండు గర్భిణిని ప్రాణాపాయం నుంచి రక్షించింది. అడవిలో ఉన్న పడేదా గ్రామంలో ప్రసవ వేదనతో సతమతమవుతున్న బూడీ అనే మహిళను సమయానికి ఆసుపత్రికి చేరుకునేలా సాయపడ్డారు. సరైన రోడ్డు మార్గంలేని పడేదా నుంచి పురుటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని.. దట్టమైన అడవుల గుండానే దాదాపు ఆరు కిలోమీటర్లు మంచంపై మోసుకెళ్లారు.

దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన గర్భవతిని మోసుకెళ్తున్న సీఆర్పీఎఫ్​

సాధారణ తనిఖీలకు వెళ్తే...

పడేదా గ్రామానికి చెందిన బూడీ అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. క్షణక్షణానికి ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. పడేదా గ్రామం దట్టమైన అడవి మధ్యలో ఉన్నందున ఆ ఊరికి సరైన రోడ్డు మార్గం లేదు. కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి. నిండు గర్భిణి వేదన చూస్తూ... ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు అప్పుడే సాధారణ తనిఖీల్లో భాగంగా అటుగా వచ్చిన కమాండర్​ అవినాష్​ రాయ్​ నేతృత్వంలోని సీఆర్పీఎఫ్​ బృందం కంటపడింది. వెంటనే ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. త్వరితగతిన స్పందించిన సీఆర్పీఎఫ్​ జవాన్లు... వాహనం కోసం వేచి చూడకుండా ఓ మంచాన్నే డోలీగా మార్చి గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పూనుకున్నారు. సుమారుగా 6 కిలోమీటర్లు అడవిలోనే నడక సాగించి.. ఆ తర్వాత ఓ వాహనం ద్వారా ఆమెను ఆసుపత్రికి చేర్చారు.

ఇదీ చదవండి:'కరోనా'పై అలర్ట్​.. 7 విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు​

Last Updated : Feb 17, 2020, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details