'గాంధీ' కుటుంబ భద్రతా విధుల్లో సీఆర్పీఎఫ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు భద్రతాపరమైన బాధ్యతలను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్( సీఆర్పీఎఫ్) స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. గత వారం కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ ) భద్రతను తొలగించింది.
ఇజ్రాయెల్ ఎక్స్-95, ఏకే సిరిస్, ఎంపీ-5 తుపాకులతో 10 మంది కేంద్ర పారా మిలటరీ కమాండోల బృందం.. సోనియా గాంధీ ఇంటి వద్ద భద్రతను కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
సోనియా గాంధీ కుటుంబాలకు ఎస్పీజీ భద్రతను తొలగించిన తర్వాత ప్రత్యేక వీవీఐపీ భద్రత కలిగిన సీఆర్పీఎఫ్ దళాలను జెడ్+ రక్షణను కల్పించింది కేంద్రం. భద్రతా విధులను సీఆర్పీఎఫ్ స్వీకరించింది. కొన్ని రోజుల పాటు భద్రతా బాధ్యతలను ఎస్పీజీ సహయంతో కొనసాగిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత దిల్లీ పోలీసులు, వివిధ దళాల సహాయంతో సీఆర్పీఎఫ్ భద్రత కల్పించనున్నట్లు తెలిపింది.
1991లో రాజీవ్ గాంధీ హత్య ఘటన తర్వాత నుంచి వీరి కుటుంబానికి ఎస్పీజీ స్థాయి భద్రతను కేటాయించారు. 28 సంవత్సరాల తర్వాత మొట్ట మొదటి సారి ఎస్పీజీ భద్రతను తొలగించింది. ప్రధాని నరేంద్ర మోదీకి దాదాపు 4 వేల మందికి పైగా ఎస్పీజీలు భద్రతను కల్పిస్తున్నారు.
ఇదీ చూడండి:జేఎన్యూ: ఫీజుల పెంపుపై నిరసనలు ఉద్రిక్తం