సమున్నత వ్యవస్థగా సుప్రీంకోర్టు అస్తిత్వాన్ని కాపాడుకోలేకపోతే దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగడే లేదని 2018 జనవరిలో బహిరంగంగా తీవ్రావేదన వెలిగక్కిన మాన్య న్యాయమూర్తుల్లో జస్టిస్ రంజన్ గొగొయి ఒకరు. భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి నాలుగు నెలలు తిరగక ముందే జస్టిస్ గొగొయి పెద్దల సభకు నామినేట్ కావడాన్ని ఆలోచనాపరులు నేడు నిర్వేదంతో పరికిస్తున్నారు! జస్టిస్ గొగొయి ఇంత త్వరగా నామినేట్ కావడం ఒక్కటే ఆశ్చర్యం కలిగించిందంటూ న్యాయపాలిక స్వతంత్రత, నిష్పాక్షికత, సమగ్రతల్ని అది ప్రభావితం చేస్తుందన్న సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్- 'చిట్టచివరి కోట సైతం కూలినట్లేనా?' అని ఆవేదనతో స్పందించారు! రాజ్యాంగంలోని 80వ అధికరణ మేరకు భిన్న రంగాలకు చెందిన 12 మంది దిగ్దంతుల్ని రాష్ట్రాల మండలి (రాజ్యసభ)కి రాష్ట్రపతి నామినేట్ చేయడం ఆనవాయితీ.
జోరందుకున్న విమర్శలు..
మోదీ ప్రభుత్వం జస్టిస్ రంజన్ గొగొయిని నామినేట్ చెయ్యడం వల్ల- న్యాయవ్యవస్థ స్వతంత్రతతో రాజీ పడినట్లయిందన్న విమర్శలు జోరెత్తుతున్నాయి. జాతి నిర్మాణ క్రతువులో చట్టసభ, న్యాయపాలిక ఏదో ఒక సమయంలో కలిసి పని చేయాలన్న గట్టి సంకల్పంతోనే రాజ్యసభ నామినేషన్‌కు సమ్మతించానని జస్టిస్ గొగొయి వ్యాఖ్యానించినా- జుడీషియరీ స్వతంత్రత, నిష్పాక్షికతలనే సమున్నత సూత్రాలపైనే ఆయన రాజీపడ్డారని మరో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ స్పందించారు. జస్టిస్ గొగొయిను రాజ్యసభకు నామినేట్ చెయ్యడంపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యమూ దాఖలైంది. ఆ న్యాయ వివాదం ఎప్పటికి ఓ కొలిక్కి వస్తుందోగాని, రాజ్యాంగ మౌలిక సూత్రాల స్ఫూర్తిసారం క్రమంగా పలచబడుతున్న వైనమే ప్రజాస్వామ్య హితైషుల్ని కలవరపెడుతోంది!
ఆది నుంచీ వ్యతిరేకిస్తూనే..
'స్వతంత్ర న్యాయపాలికే రాజ్యాంగ మౌలిక స్వరూపం' అంటూ 1973 నాటి కేశవానంద భారతి కేసులో ఇచ్చిన తీర్పునకు కట్టుబడి- కొలీజియం వ్యవస్థ విషయంలో రాజీ పడేది లేదని సుప్రీంకోర్టు భీష్మిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి నియామకంలో సీనియారిటీ సంప్రదాయాన్ని తోసిపుచ్చి 1973లోనే జస్టిస్ ఏఎన్ రేను, 1977లో జస్టిస్ ఎంహెచ్ బేగ్‌ను సీజేఐలుగా నియమించిన కాంగ్రెస్ భ్రష్ట రాజకీయం న్యాయపాలిక స్వతంత్రతను అప్పట్లో దెబ్బతీసింది. న్యాయపాలికలో విధేయస్వామ్యాన్ని పాదుకొలిపే ఆ తరహా పెడపోకడల్ని భాజపా మొదటి నుంచీ గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చింది. 'పదవీ విరమణ వయస్సు అనేది ఒకటి ఉన్నా అందుకు జడ్జీలు సిద్ధంగా లేరు. పదవీ విరమణ తరవాత పొందే ఉపాధి- పదవిలో ఉండి వెలువరించే తీర్పుల్ని ప్రభావితం చేస్తోంది' అని రాజ్యసభలో విపక్ష నేతగా అరుణ్ జైట్లీ 2012లో నిరసించారు. న్యాయపాలిక నిష్పాక్షికతను దారుణంగా దెబ్బతీస్తున్న ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చిందనీ అభిప్రాయపడ్డారు.
గతంలోనూ..
భారత ప్రధాన న్యాయమూర్తిగా 2014 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేసిన జస్టిస్ పి.సదాశివం అదే ఏడాది సెప్టెంబరులో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు! 2018 జులైలో పదవీ విరమణ చేసిన రోజే జస్టిస్ ఆదర్శ్ గోయల్ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు! జస్టిస్ హిదయతుల్లా 1979లోనే ఉపరాష్ట్రపతి అయ్యారన్నది నిజమే అయినా, పదవీ విరమణ చేసిన తరవాత దాదాపు తొమ్మిదేళ్లకు జరిగిందది! సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ రిటైరయ్యాక ఐదేళ్లకు తమిళనాడు గవర్నర్‌గా నియుక్తులయ్యారు. 1991లో సీజేఐగా రిటైరైన రంగనాథ్ మిశ్రా 1998 జులైలో రాజ్యసభకు కాంగ్రెస్ పక్షాన ఎన్నికయ్యారు. సిక్కుల ఊచకోత కేసుల్లో సానుకూలతకు ప్రతిఫలంగానే జస్టిస్ మిశ్రాకు రాజ్యసభ సీటు దక్కిందని కమలనాథులు అప్పట్లో విమర్శలు రువ్వారు. జస్టిస్ గొగొయిరాజ్యసభ సభ్యత్వంపై అదే తరహా వివాదాలు వెల్లువెత్తుతున్న తీరు- న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను నిలబెట్టే నిర్దుష్ట సంస్కరణల ఆవశ్యకతను ప్రబోధిస్తోందిప్పుడు!
లా కమిషన్ నివేదిక..
కేరళ గవర్నర్‌గా జస్టిస్ సదాశివాన్ని నియమించడాన్ని సవాలు చేస్తూ న్యాయపాలిక స్వతంత్రతను కాపాడాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 2014 అక్టోబర్‌లో దాన్ని కొట్టివేస్తూ నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎన్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే (ప్రస్తుత సీజేఐ) ఇచ్చిన తీర్పు- విశ్రాంత న్యాయమూర్తులు పదవులు చేపట్టకుండా నిలువరించేది లేదని స్పష్టీకరించింది. పదవీ విరమణ దరిమిలా న్యాయమూర్తులపై గల రాజ్యాంగబద్ధ విధినిషేధాలపై ఏనాడో 1958లోనే దృష్టి సారించిన లా కమిషన్ తన పద్నాలుగో నివేదికలో దానిపై సూటిగా స్పందించి- జడ్జీల స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే ధోరణిని నిలిపివేయాలని సూచించింది. ఆ మేలిమి సిఫార్సుకు మన్నన దక్కకపోబట్టే న్యాయపీఠాల నిష్పాక్షికత ప్రశ్నార్థకమయ్యేలా సంకుచిత రాజకీయాలు పురివిప్పుతున్నాయి.
విరామ కాలావధి నిర్ధరించలేమని..
పదవీ విరమణ తరవాత కనీసం రెండేళ్లపాటు ఏ జడ్జీ ఏ నియామకాన్నీ ఆమోదించరాదని 2014లో సీజేఐగా రిటైరైన రోజున జస్టిస్ ఆర్.ఎం.లోథా అభిలషించారు. అలా విరామ కాలావధి నిర్ధారించలేమని సుప్రీంకోర్టు స్పష్టీకరించగా, కేంద్ర ప్రభుత్వమూ అదే మాటను నిరుడు ఫిబ్రవరిలో రాజ్యసభకు తెలిపింది. దాదాపు 50శాతం కేసుల్లో ప్రభుత్వమే కక్షిదారుగానో మరో విధంగానో ప్రమేయం కలిగి ఉన్నప్పుడు- సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తే పదవీ విరమణ తరవాత ప్రయోజనకర పదవులు దక్కుతాయన్న భావన న్యాయపాలికలో ప్రబలడం దాని స్వతంత్రత, నిష్పాక్షికతలను కచ్చితంగా దెబ్బతీస్తుందని లా కమిషన్ నిర్ద్వంద్వంగా చాటింది. అలాంటప్పుడు జడ్జీలు రిటైరయ్యాక కనీసం ఆరేళ్లపాటు ఏ పదవులూ చేపట్టకుండా చట్టబద్ధ నిషేధం విధిస్తే- అప్పటి ప్రభుత్వానికి అనుకూల తీర్పులన్న మరకలకు ఆస్కారం లేకుండా పోతుంది. న్యాయపాలిక ప్రతిష్ఠా ఇనుమడిస్తుంది!
ఇదీ చదవండి:'రాజ్యసభ సభ్యునిగా నేడే జస్టిస్ గొగొయి ప్రమాణం'