దీపావళి దంతేరాస్.. అనగానే నగల దుకాణాల్లో మహిళల సందడి నెలకొంటుంది. బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంట అడుగుపెడుతుంది అన్న నమ్మకం వల్ల దంతేరాస్ రోజు నగల దుకాణాలు కిటకిటలాడుతూ ఉంటాయి. ఇదే అదునుగా చూసుకొన్న ఓ దొంగల ముఠా బిహార్లోని ఓ నగల దుకాణంలో చొరబడి రెండున్నర లక్షల రూపాయలు విలువ చేసే పసిడిని ఎత్తుకెళ్లింది.
బిహార్ రాజధాని పట్నాలోని అగమ్కువా ప్రాంతం... భగవత్ నగర్లోని ఓ నగల దుకాణం నిన్న కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. అప్పుడే దుకాణంలోకి ముసుగులు ధరించి కొంతమంది చొరబడ్డారు. తుపాకితో కాల్పులు జరిపి.. భయభ్రాంతులకు గురిచేశారు. దొంగలని గ్రహించిన సిబ్బంది ప్రతిఘటించేందుకు యత్నించారు. దొంగలు కాల్పులు జరిపి ఒకరిని పొట్టన పెట్టుకున్నారు. రూ. 2.5 లక్షల విలువ చేసే ఆభరణాలను ఎత్తుకుని పరారయ్యారు.