సుప్రీంకోర్టులో భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ ఆరోడా సహా పలువురు రాజకీయ నాయకులపై ఓ న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల నేర చరిత్ర వివరాలను వెల్లడించాలని సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులను పూర్తిగా పాటించనందుకు చర్యలు తీసుకోవాలని కోరారు దిల్లీకి చెందిన బ్రజేశ్ సింగ్.
భయంకరమైన నేరస్థులను బిహార్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించారని, వారి నేర చరిత్ర వార్తాపత్రికలలో ప్రచురించలేదని పిటిషనర్ ఆరోపించారు. అభ్యర్థుల వివరాలు ఒక హిందీ పత్రికలోనే ప్రచురించారని నివేదించారు. ప్రజాదరణ, విద్య, సామాజిక సేవ, ప్రత్యర్థుల కారణంగా కేసులు నమోదైనట్లు కారణాలు చెప్పారని వివరించారు.
ప్రముఖ నేతలపైనా..
పిటిషన్లో ఆరోడాతో పాటు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా, భాజపా నేత బీఎల్ సంతోష్, బిహార్ ఎన్నికల అధికారి శ్రీనివాస్, జేడీయూ నేత కేసీ త్యాగిపై ఫిర్యాదు చేశారు. భాజపా, ఆర్జేడీలో ఇలాంటి అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను పాటించనందుకు వారిపై సుప్రీం చర్యలు తీసుకోవాలని కోరారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు..
నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రజలకు తెలిసేలా టీవీ, పత్రికల్లో మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాలని 2018 అక్టోబర్‌లోనే ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. నామినేషన్ ఉపసంహరణ తేదీ అనంతరం నాలుగు రోజుల్లో అభ్యర్థి మొదటిసారిగా తన క్రిమినల్ రికార్డు గురించి ప్రజలకు తెలియజేయాలంది. అనంతరం 5 నుంచి 8 రోజుల్లో రెండోసారి, ప్రచారం చివరి తేదీ నాటికి మూడోసారి తమపై ఉన్న నేరచరిత్రను వెల్లడించాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:1,157 మంది నేర చరితుల భవితవ్యం తేలేది రేపే