కరోనాను తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. కరోనా కట్టడి సంగతేమో కానీ.. ఈ లాక్‌డౌన్ మొదలయ్యాక భారత్ సహా పలు దేశాల్లో గృహహింస బారిన పడుతున్న మహిళల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. భారత్‌లో అయితే లాక్‌డౌన్ కాలంలో గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు రెండు రెట్లు అధికమయ్యాయని జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం అఘాయిత్యాలకు గురవుతున్న మహిళల కోసం ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్ వేదికను కూడా ఏర్పాటుచేసింది. ఈ పరిస్థితుల్లో గృహహింస బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ మైగ్రో బ్లాగింగ్ సైట్ ‘ట్విట్టర్ ఇండియా’ కూడా తాజాగా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా గృహహింసకు సంబంధించి అవసరమైన సమాచారం, కొత్త అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేకంగా ‘సెర్చ్ ప్రాంప్ట్’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
క్లిష్ట పరిస్థితుల్లో...
మహిళా చైతన్యానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, జాతీయ మహిళా కమిషన్‌తో కలిసి పనిచేస్తోంది ట్విట్టర్ ఇండియా. ఈ క్రమంలో గృహహింసకు సంబంధించి కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా సెర్చ్ ప్రాంప్ట్ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. #ThereIsHelp అనే హ్యాష్ ట్యాగ్‌తో కూడిన ఈ సెర్చ్ టూల్ ద్వారా క్లిష్ట పరిస్థితుల్లో నమ్మదగిన సమాచారాన్ని అందించి మహిళలకు సహకరిస్తుందని ఆ సంస్థ తెలిపింది. అదే విధంగా ఈ ఫీచర్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ గృహహింసకు సంబంధించిన సమాచారం, కొత్త కీవర్డ్స్‌ను అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సమాచారమిచ్చే ఈ సెర్చ్ ప్రాంప్ట్.. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలతో పాటు మొబైల్.ట్విటర్.కామ్‌లో కూడా కనిపిస్తుంది.
ఈ ఫీచర్‌తో గృహహింసపై పోరాటం చేద్దాం!