కర్ణాటకలో కాంగ్రెస్- జేడీ(ఎస్) మధ్య వివాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్నారు.
జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ తాజాగా సిద్ధరామయ్యపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్యే సీఎం అంటూ చేస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టారు.
''సిద్ధరామయ్య ఏం చేశారు. మాజీ ముఖ్యమంత్రి దేవ్‌రాజ్ కంటే గొప్పగా పరిపాలించారా? 30 ఏళ్లయినా ఆయనను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. దశాబ్దాల పాటు గుర్తుంచుకోదగిన ఒక్క మంచి పనైనా సిద్ధరామయ్య చేయగలిగారా? ఏమీ చేయలేదు.''
- విశ్వనాథ్, కర్ణాటక జేడీ(ఎస్) అధ్యక్షుడు
సిద్ధరామయ్య అంతే దీటుగా బదులిచ్చారు. విశ్వనాథ్ వ్యాఖ్యలను సమన్వయ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని ట్వీట్ చేశారు.
'అంతకుముందు జీటీ దేవెగౌడ(ఉన్నత విద్యాశాఖ మంత్రి), ఇప్పుడు విశ్వనాథ్. తర్వాత ఎవరో తెలియదు? జేడీ(ఎస్) సీనియర్లు ఇది గమనిస్తే మంచిది. విశ్వనాథ్ చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై బహిరంగంగా విమర్శించకుండా సంకీర్ణ ధర్మం అడ్డుపడుతుంది.'