వచ్చే ఏడాది జరగబోయే బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయనుంది సీపీఎం. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ లౌకిక శక్తులతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. శుక్ర, శనివారాల్లో వర్చువల్‌గా నిర్వహించిన సమావేశాల అనంతరం పార్టీ నిర్ణయాలను వెల్లడించారు.
కేరళలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ కూటమిగానే బరిలోకి దిగనున్నట్లు సీపీఎం స్పష్టం చేసింది. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమితో కలిసి పనిచేయనుంది. అసోంలోనూ కాంగ్రెస్ సహా ఇతర లౌకిక పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది సీపీఎం. అక్కడ అధికార భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా ఇతర పార్టీలతో కలిసి పనిచేయనున్నట్లు పేర్కొంది.
పశ్చిమ బంగాలో మూడు దశాబ్దాల పాటు ఏలిన సీపీఎం.. అధికార తృణమూల్‌ను, భాజపాను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా ఇతర లౌకిక పార్టీలతో ఎన్నికల అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. 294 స్థానాలకుగాను ఆ పార్టీకి 2016లో కేవలం 26 స్థానాలు మాత్రమే వచ్చాయి.